కూటి కోసం, కూలి కోసం దేశం విడిచి బయలుదేరిన ఆ మహిళకు ఎంత కష్టం... కాయకష్టం చేసినా పొట్టనిండని బతుకులు... గూడూ, గుడ్డలేని జీవనం... ఎన్నాళ్లిలా...కువైట్ వెళ్తే నాలుగు రాళ్లు వెనుకేసుకొని... కనీసం ఇల్లయినా కట్టుకోవచ్చునని ఆ దంపతులు ఆలోచించారు. ముందుగా మధ్యవర్తి ద్వారా భార్యను పంపించిన ఆ భర్తకు పిడుగులాంటి వార్త... ‘నేను పని చేస్తున్న ఇంటి యజమాని నరకం చూపిస్తున్నాడు. తన లైంగిక వాంఛలను తీర్చమంటున్నాడు. కాదన్నందుకు ఎక్కడబడితే అక్కడ కాల్చిన సిగరెట్‌తో వాతలు పెడుతున్నాడు. చెప్పుకోలేని విధంగా వికృత చేష్టలు. అంత హింస పెడుతున్నా లొంగలేదు. ప్రతిఘటిస్తూనే ఉన్నాను. పీకమీద కత్తి పెట్టి భయపెడుతున్నాడు. ఎవరికీ చెప్పుకోలేవని, తాను చెప్పినట్టు నడుచుకోవాలని, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి నిన్నెవరు కాపాడతాడంటూ వికటాట్ట హాసం చేస్తున్నాడు అని భార్య విలాపం. ‘ఏదో ఒకటి చేసి నన్ను ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉండలేను. నన్ను బాబా చంపేస్తాడు... వెంటనే తీసుకెళ్లి రక్షించండ’ంటూ ఆర్తనాదం.
– ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ మహిళ తన భర్తకు ఫోన్లో చెప్పుకున్న రోదనిదీ.. బయటపడింది ఈ ఒక్క గొంతు... వినిపించని వేలగొంతులెన్నో...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కువైట్, మస్కట్, ఖతర్, దుబాయి, అబుదాబి తదితర గల్ఫ్ దేశాలకు ఉపాధికోసం వెళ్తున్నారా? వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మధ్యవర్తులు ఎలాంటి వారు? పనికోసం పెట్టుకుంటున్న యజమానులు ఎలాంటి వారో తెలుసుకోకపోతే ఇదిగో ఇలానే చిత్రహింసలకు గురికావల్సి వస్తుంది. కోనసీమలోని పలు గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. సుమారు 20 వేల మంది వరకు ఇలా వెళ్లినవారిలో ఉన్నారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు. వెళ్లినవారిలో ఎక్కువమంది ఇలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి తీసుకు వెళ్లే వరకే మధ్యవర్తులు బాధ్యత తీసుకుంటున్నారు తప్ప వారి యోగక్షేమాలను తెలుసుకోకపోవడంతో పనికి పెట్టుకున్న ఇంటి యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న చిత్రహింసలపై వీడియో క్లిప్పింగ్స్ అనేకం వస్తూనే ఉన్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, అవి ఎవరివి? ఏమిటనేది మహిళల కుటుంబీకులు, బంధువులకు మాత్రమే తెలుస్తున్నాయి. ఎక్కడ పరువు పోతుందోనని బయటకు చెప్పలేక ఇక్కట్లు పడుతున్న కుటుంబాలెన్నో...
ఫిర్యాదుతో వెలుగులోకి...
ఇరవై రోజుల కిందట ఉపాధి కోసమని కువైట్ వెళ్లిన కాట్రేనికోన మండలానికి చెందిన ఓ మహిళ ఆక్రందన వింటే ఎవరికైనా హృదయం ద్రవించకమానదు. ఉన్న అప్పులు తీర్చి, సొంతిల్లు కట్టుకోవచ్చన్న ఆశతో కువైట్ వెళ్లిన మహిళ అక్కడ చిత్రహింసలకు గురవుతోంది. మాన ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితిలో ఉంది. ఇప్పుడామెను మన దేశానికి రప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ మహిళ భర్త కె. వెంకటరమణ ఐ.పోలవరం పోలీసులను ఆశ్రయించాడు. తనకున్న అప్పులను తీర్చి, తదుపరి సంపాదనతో సొంతిల్లు నిర్మించుకోవచ్చన్న ఆశతో కువైట్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయినవిల్లి మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే మధ్యవర్తిని ఆశ్రయించాడు. తొలుత తన భార్యను పంపించి, తర్వాత తాను వెళ్దామని భావించాడు. మధ్యవర్తి ద్వారా కువైట్ పంపించేందుకు దాదాపు రూ. 70 వేలు ఖర్చు పెట్టాడు. అతి కష్టం మీద పాస్‌పోర్టు సంపాదించి 20 రోజుల క్రితం భార్యను పంపించాడు.
కువైట్‌లో ఓ బాబా ఇంట్లో పని మనిషి కింద మధ్యవర్తి పెట్టించాడు. మూడు రోజులు బాగానే ఉన్నా తర్వాత ఆ మహిళపై వేధింపులు మొదలయ్యాయి. ఆ ఇంటి యజమాని తనను శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. తన లైంగిక వాంఛలను తీర్చాలని ప్రతిరోజూ మీద పడడం... వినకపోతే సిగరెట్‌తో కాల్చి వాతలు పెడుతున్నాడు. ఎంతకీ ఒప్పుకోకపోవడంతో పీక మీద కత్తి పెట్టి మరీ బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా శరీరంపై ఎక్కడపడితే అక్కడ తడుముతూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. గత పది రోజులుగా ఈ వేధింపులు అధికమవడంతో ఆమె నేరుగా తన భర్తకు ఫోన్ చేసి జరిగిందంతా విలపిస్తూ చెప్పుకుంది. తాను చేసిన వికృత చేష్టలను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి, దాన్ని చూపిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని బోరున విలపించింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఇండియాకు తీసుకెళ్లిపోవాలని మొరపెట్టుకుంది. తనతోపాటు అదే ప్రాంతంలో మరో తొమ్మిది మంది జిల్లా మహిళలు కూడా ఇదేరకంగా నరకం చూస్తున్నారని చెప్పుకొచ్చింది.
తన భార్యకు జరిగిన అన్యాయం బయట ప్రపంచానికి తెలియాలని వెంకటరమణ తన భార్య వాయిస్‌ను రికార్డు కూడా చేశాడు. మధ్యవర్తికి ఫోన్ చేసి ఆ నరకం నుంచి కాపాడాలని వేడుకున్నాడు. కానీ మధ్యవర్తి పట్టించుకోలేదు సరికదా... కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సెట్ అయిపోతాయని సమర్ధిస్తూ వస్తుండటంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. దీంతో బాధితుడు వెంకటరమణ ‘సాక్షి’తోపాటు ఐ.పోలవరం పోలీసులను ఆశ్రయించాడు. భార్యతో మాట్లాడిన వాయిస్ రికార్డులను కూడా అటు పోలీసులకు, ఇటు ‘సాక్షి’కి అందజేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని మధ్యవర్తితో మాట్లాడటమే కాకుండా పోలీసు స్టేషన్‌కు రమ్మని ఆదేశించారు. అయితే, మధ్యవర్తి మాత్రం వెంకటరమణ భార్యను తీసుకొచ్చేస్తానని, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నానని పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఇదే విషయమై మధ్యవర్తి సుబ్రహ్మణ్యంకు ‘సాక్షి’ ఫోన్ చేయగా స్పందించలేదు. నమ్మించి మోసగించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా తమను ఆదుకోవాలని భర్త వెంకటరమణ ప్రాధేయ పడుతున్నాడు. వాస్తవానికైతే, ఇటువంటి ఫిర్యాదులు జిల్లాలో అనేక చోట్ల వస్తున్నాయి. కాకపోతే, మధ్యవర్తులు చాకచక్యంగా మేనేజ్ చేసుకుని బయటికి రాకుండా చూసుకుంటున్నారు.
ఫిర్యాదు మేరకు మధ్యవర్తితో మాట్లాడాం
తన భార్యను కువైట్‌లో చిత్ర హింసలు పెడుతున్నారని వెంకటరమణ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై వెంటనే స్పందించాం. మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితో వెంటనే మాట్లాడాం. ఇండియాకు తీసుకొచ్చేస్తానని ఆ మధ్యవర్తి చెప్పాడు. నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
– డి.దుర్గా శేఖర్‌రెడ్డి, ఎస్సై, ఐ.పోలవరం
Comments
Please login to add a commentAdd a comment