సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర విభజన అనివార్యమైతే వెనుకబడిన ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న అంశం ఓవైపు కళ్లెదుట కన్పిస్తోంది. భవిష్యత్ తరాలు క్షమించరనే భావన రాజకీయ పార్టీల్లో వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో ప్రజల కోసం, ప్రాంతం కోసం చిత్తశుద్ధితో ఉద్యమబాటను వైఎస్సార్‌సీపీ ఎంచుకుంది. ప్రజాభీష్టం ఏదైనా విభజనే తమ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. అందుకు అడ్డువచ్చేవారిని అణచివేయాలనే సంకల్పంతో ఉంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులపై అధికార దర్పం ప్రదర్శిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
జిల్లాలో ‘దాస్’ పోలీసు శకం ఆరంభమైందా? ప్రజాస్వామ్య హక్కులను కాలరాయనున్నారా? రాజకీయ పార్టీల పట్ల వివక్షత ప్రదర్శించనున్నారా? అంటే అవుననే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఊతంగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఎస్పీగా పనిచేసిన మనీష్‌కుమార్‌సిన్హా ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో వివాదాస్పదంగా ఉన్న పోలీసుశాఖ ప్రతిష్ట ఆయన చర్యల కారణంగా పెంపొందిందని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో నెలకొన్న పలు అంశాలను పరిశీలిస్తే పాతరోజులు పునరావృతం కానున్నాయా అనే సందేహాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు.
ఉద్యమానికి పోలీసు ఆంక్షలు..!
రాష్ర్ట విభజన అంశం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు ఏమాత్రం యోగ్యకరం కాదు. ఆ మేరకు ప్రజలు లక్షలాదిగా రోడ్లపైకి చేరి సుదీర్ఘకాలం వివిధ రూపాల్లో నిర సన తెలిపారు. విభజన నిర్ణయం వెలువడి బుధవారం నాటికి 99 రోజులు గడుస్తున్నా, సమైక్యరాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజానీకం అలుపెరుగని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ప్రజాభీష్టంతో నిమిత్తం లేకుండా ఓట్ల రాజకీయానికే ప్రాధాన్యతనిస్తూ కేంద్రప్రభుత్వం తన చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. అందులో భాగంగా నవంబర్ 1న వి‘భజనపరుల’ దిష్టి బొమ్మలను తగులబెట్టాలని పిలుపునిచ్చింది.
ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, సుశీల్‌కుమార్‌షిండే, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటోలతో కూడిన బొమ్మను కాల్చేందుకు సమైక్యవాదులు సమాయత్తమయ్యారు. అయితే దిష్టిబొమ్మల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటోను తొలగించాలని పోలీసు అధికారులు ఆంక్షలు తీవ్రతరం చేశారు. ఆ మేరకు కొంత సఫలీకృతులయ్యారు. ఉద్యమాన్ని ఇట్లాగే చేయాలి, వీరిని మాత్రమే టార్గెట్ చేయాలని పోలీసు అధికారులు ఆదేశించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రూప్ ఆఫ్ మంత్రులు సమావేశ మవుతున్న తరుణంలో 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం చేపట్టి నిరసనను వ్యక్తం చేయాలని సమైక్యరాష్ట్రం ఆకాంక్షిస్తున్న వైఎస్సార్‌సీపీ పిలుపు నిచ్చింది. ఆ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు రహదారులు దిగ్బంధం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ఎంచుకున్నారు. చాలా ప్రశాంతంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టినా అరెస్టుల పర్వానికి తెరలేపారు. పులివెందులలో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శించి మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారు. పోలీసు చర్యల కారణంగా ఓ మహిళ గాయపడింది. ఇలాంటి ఘటనలు పరిశీలిస్తే పోలీసు చర్యలు ప్రజాస్వామాన్ని హరించేందుకు ప్రాధాన్యత నిస్తున్నాయా అనే అనుమానాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలంటున్నారు.
నీరుగార్చడమే అసలు లక్ష్యం
వైఎస్సార్‌సీపీ చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని నీరుగార్చడమే పోలీసు అధికారుల ముఖ్య ఉద్దేశంగా కన్పించిందని పలువురు పేర్కొంటున్నారు. సమైక్య ఉద్యమంలో ప్రజామద్దతు ఆశించిన మేరకు ఆ పార్టీకి దక్కకూడదనే భావనతోనే అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను వాడుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పజల కోసం శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తున్న నాయకులను అరెస్టు చేయడాన్ని సమైక్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అరెస్టు చేశారని తెలుసుకొని మలివిడతగా రోడ్లపెకి జనం రావడంతో వారిని కూడా అరెస్టులతో సాగనంపారు. ఈ చర్యలను పరిశీలిస్తే వైఎస్సార్ జిల్లాలోనే ఉద్యమం సక్రమంగా చేపట్టలేదనే భావన కల్పించడం... లేదా సమర్థవంతంగా తాము నిలవరించామని చెప్పుకోవడమో... తెరవెనుక లక్ష్యంగా ఉన్నట్లు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
ఉద్యమంపై ఉక్కుపాదం..!
Published Thu, Nov 7 2013 2:41 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement