
గూడుపుఠాణి
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఆవాసాల్లో అవినీతి గూడు కట్టుకుంది.
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లకు అవినీతి మకిలి
పూర్తి సొమ్ము చెల్లించినా బకాయిలే అంటున్న వైనం
యూసీడీ చేతివాటం
విచారణ చేస్తామన్న కమిషనర్
విజయవాడ సెంట్రల్ : జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఆవాసాల్లో అవినీతి గూడు కట్టుకుంది. అనర్హులకు ఇళ్లు కట్టబెట్టడంతో అక్రమాలకు తెరలేపిన అధికారులు అందినకాడికి పేదల్ని దోచేస్తున్నారు. బ్యాంకులకు జమచేయాల్సిన రుణాలతో జేబులు నింపుకొంటున్నారు. బకాయిలు చెల్లించపోతే ఇళ్లు సీజ్ చేస్తామంటూ బ్యాంకర్లు వెళ్లడంతో బండారం బయటపడింది. సతీష్‌రాజు, అతడి బంధువులకు వాంబే కాలనీలో కె.కె. 4, 5 ఫ్లాట్లను ఐదేళ్ల కిందట కేటాయించారు. తొలివిడతగా రూ.10 వేలు, ఇంటి రిజిస్ట్రేషన్ సమయంలో రూ.34,100 చొప్పున యూసీడీ సీడీవో (కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఆఫీసర్) లకు చెల్లించినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ఇంటి పత్రాల పేరుతో కొన్ని కాగితాలను అందజేశారు. రెండురోజుల క్రితం బ్యాంకర్లు వచ్చి మీ పేరుతో బ్యాంక్‌లో రూ.31,400 బకాయి చూపిస్తోందని, చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో బెంబేలెత్తిన లబ్ధిదారులు కొందరు నగరపాలక సంస్థకు చేరుకుని సీడీవో దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించారు. బ్యాంకర్లు పొరపాటున మీ ఇళ్లకు వచ్చి ఉంటారు. వాళ్లకు నేను చెబుతాలే. ఇబ్బందేమీ లేదు’ అంటూ ఆయన నచ్చజెప్పి పంపేశారు.
బోగస్ రసీదులు
కాల్వగట్లపై ఆక్రమణల తొలగింపు నుంచి జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపు వరకు అన్ని బాధ్యతల్ని హౌసింగ్, యూసీడీ, టౌన్‌ప్లానింగ్ అధికారులకు అప్పగించారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను యూసీడీ విభాగంలోని సీడీవో స్థాయి అధికారి చూస్తున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు ఇంటి ధర రూ.44 వేలు ఉండేది. ప్రస్తుతం రూ.66 వేలకు చేరింది. ఇళ్లు మంజూరైన వెంటనే రూ.10 వేలు చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంక్ లోన్ లేదా సొంత సొమ్ముతో చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇక్కడే అధికారులు కొందరు అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బోగస్ రసీదులు లబ్ధిదారులకు ఇచ్చి ఆ సొమ్ముల్ని నొక్కేశారని తెలుస్తోంది. ఇందుకు ఓ ప్రైవేటు ఉద్యోగిని అడ్డం పెట్టుకున్నట్లు సమాచారం.
అక్రమాలు కోకొల్లలు
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా 2006లో నగరానికి 28,152 ఇళ్లు మంజూరు కాగా 18,176 ఇళ్లను మాత్రమే నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. ఇందులో 14 వేల గృహాలు పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయినవాటిలో 10,500 ఇళ్లనే కేటాయించారు. ఇందులో కేవలం 3 వేల గృహాలకు మాత్రమే బ్యాంకర్లు రుణాలిచ్చారు. మిగిలిన వాటికి వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులే డబ్బు చెల్లించారు.
ఈ గృహాల్లో 30 శాతం అనర్హులకు కేటాయించారన్నది బహిరంగ రహస్యం. ఇళ్లు మంజూరు చేయిస్తామని బ్రోకర్లు కొందరు భారీగా డబ్బులు దండుకున్నారు. దీనిపై పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్ల కేటాయింపుల పేరుతో మామూళ్లకు తెగబడ్డ వర్క్ ఇన్‌స్పెక్టర్లు ముగ్గురిని ఇటీవలే కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
పొంతనలేని సమాధానం
కొన్ని గృహాలకు సంబంధించిన నగదు కమిషనర్ అకౌంట్‌లో జమఅయింది. సతీష్‌రాజు చెల్లించిన మొత్తం కమిషనర్ అకౌంట్‌లో ఉండి ఉండొచ్చు. పరిశీలించాల్సి ఉందంటూ సీడీవో దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. కమిషనర్ అకౌంట్‌లో నగదు జమ అయితే ఎస్‌బీఐలో బకాయి ఎందుకు చూపిస్తోందన్న ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. శివ అనే ప్రైవేటు ఉద్యోగిని తాను ఏర్పాటు చేసుకున్నానని స్పష్టం చేశారు.
విచారణ చేపడతాం
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం గృహాల వసూళ్లకు సంబంధించి విచారణ చేపడతామని కమిషనర్ జి.వీరపాండియన్ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.