భద్రతలేని బతుకులు! | Insecure Labour Lives On Construction Sites | Sakshi
Sakshi News home page

భద్రతలేని బతుకులు!

Published Wed, Jul 24 2019 10:48 AM | Last Updated on Wed, Jul 24 2019 10:48 AM

Insecure Labour Lives On Construction Sites - Sakshi

సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ప్రజాప్రతినిధుల కోసం 12 అంతస్తుల భవన నిర్మాణ పనుల వద్ద నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ నిర్లక్ష్యంతో సోమవారం ముగ్గురు కూలీల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్కడ సాగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో లిఫ్ట్‌ జారి పడి అందులో ఉన్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. 12 అంతస్తుల టవర్స్‌ నిర్మాణం చేస్తున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యతను నిర్మాణ సంస్థలు విస్మరించాయి. 

గత అనుభవాలున్నా.. పట్టదు
ప్రజాప్రతినిధుల క్వార్టర్స్‌ వద్దే ఈ ఏడాది మే నెలలో విషాహారం భుజించిన 30 మంది కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరో ముగ్గురు కూలీలు మరణించడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకఘటన జరిగిన తర్వాత కూడా ఎన్‌సీసీ సంస్థ పాఠాలు నేర్వడం లేదు. కనీసం కూలీలకు పరిహారం అందజేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తుళ్లూరు మండలం నేలపాడు వద్ద తాత్కాలిక హైకోర్టు నిర్మాణం వద్ద టిప్పర్‌ కింద పడి ఒక కూలీ మృతి చెందారు. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని వస్తున్న కూలీలపై నిర్మాణ సంస్థలు కనికరం చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. సంఘటన జరిగిన తర్వాత అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు లేకపోలేదు. 

గుంతల్లో పడి ఆరుగురు మృతి
రాజధాని పరిధిలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏడీసీ) అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టింది. రోడ్ల పక్కన డ్రెయినేజీ కోసం పది అడుగుల మేర గుంతలు తవ్వారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాల వల్ల గుంతల్లో పది అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. శాఖమూరు వద్ద అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతూ గుంతలో పడి ప్రాణాలు వదిలారు. రోడ్డు కోసం గుంత తవ్విన చోట నిర్మాణ సంస్థ హెచ్చరిక బోర్డు పెట్టకపోవడంతోనే ఆ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు. అలాగే గతేడాది ఆగస్టులో తుళ్లూరు మండలం దొండపాడు వద్ద ఆడుకోవడానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గుంతల్లో పడి ప్రాణాలు వదిలారు. అలాగే తుళ్లూరు మండల కేంద్ర సమీపంలో ఓ వ్యక్తి చనిపోయారు.

తుళ్లూరు(తాడికొండ): లిఫ్ట్‌ ప్రమాదం జరిగిన స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు. తుళ్లూరు డీఎస్పీ కేశప్ప ప్రమాదం జరిగిన తీరును కలెక్టర్‌కు వివరించారు. అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్‌ మాట్లాడారు. కనీస జాగ్రత్త చర్యలు తీసుకోపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాయపూడి నుంచి అమరావతి మండలం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న కార్మికుల మృతదేహాలను పరిశీలించి, మృతుల బంధువులను పరామర్శించారు. కలెక్టర్‌తోపాటు జేసీ దినేష్, అడిషనల్‌ ఎస్పీ ప్రసాద్, తుళ్లూరు తహసీల్దార్‌ సంజీవకుమారి, తుళ్లూరు సీఐ విజయకృష్ణ ఉన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారమివ్వాలి..
కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తూ, కనీస భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యవహరిస్తున్న ఎన్‌సీసీ నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన ముగ్గురు కార్మికుల ప్రతి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ
సభ్యుడు సీహెచ్‌ బాబురావు డిమాండ్‌ చేశారు. మంగళవారం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ఎన్‌సీసీ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాన్ని సీఐటీయూ నాయకుల బృందం పరిశీలించింది.  

నిర్మాణాల వద్ద అంబులెన్స్‌లు ఎక్కడ..?

రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో అనుకోని ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోయింది. చాలా నిర్మాణ సంస్థలు అంబులెన్స్‌లను నిర్మాణాలు జరుగుతున్న చోట అందుబాటులో ఉంచడం లేదు. ఫలితంగా ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక వైద్యం అందకపోవడంతోనే కూలీలు తనువు చాలిస్తున్నారు. నిర్మాణ కంపెనీలు నిబంధనలు పాటించకున్నా సంబం ధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ శామ్యూల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement