శ్రీకాకుళం న్యూకాలనీ:ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరంలో మార్కులను పెంచుకునేందుకు (ఇంప్రూవ్‌మెంట్) కోసం దరఖాస్తు చేస్తున్న 9,984 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 28,150 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో ఇంప్రూవ్‌మెంట్ కోసం 9,910 మంది, ఫెయిలైన విద్యార్థులు 9,930 మంది, ఒకేషనల్ విభాగంలో ఇంప్రూవ్‌మెంట్ కోసం 74 మంది, ఫెయిలైన విద్యార్థులు 306 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 7,763 మంది, ఒకేషనల్‌లో 167 మంది ఫెయిలైన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించారు.
59 కేంద్రాలు కేటాయింపు
సప్లిమెంటరీ పరీక్షలను 59 కేంద్రాలను అధికారులు కేటాయించారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు జవాబుపత్రాలతోపాటు నామినల్‌రోల్స్, ఇతర మెటీరియల్‌ను చేరవేశారు. శ్రీకాకుళం పట్టణంలోనే తొమ్మిది కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకుగాను 59 మంది చీఫ్ సూపరింటెండెట్లు, 59 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, ఏసీవోలను నియమించారు.
తనిఖీ బృందాల నియామకం
పరీక్షల విభాగం డీఈసీ కన్వీనర్, ఆర్‌ఐవో ఎ.అన్నమ్మ నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.యజ్ఞభూషణరావు(ప్రిన్సిపాల్ -టెక్కలి), బొడ్డేపల్లి మల్లేశ్వరరావు(ప్రిన్సిపాల్ -కోటబొమ్మాళి), జి.వి.జగన్నాథరావు (హిస్టరీ లెక్చరర్ -తొగరాం)తోపాటు హైపవర్ కమిటీ సభ్యులగా చౌదరి ఆదినారాయణ (ప్రిన్సిపాల్ -రణస్థలం)లను ఇంటర్‌బోర్డు నియమించిన విషయం తెలిసిందే. వీరితోపాటు పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతోపాటు మరో ఐదు సిట్టింగ్ స్క్వాడ్‌లను, ఇతర సిబ్బందిని నియమించారు.
అప్రమత్తంగా ఉండండి:ఆర్‌ఐవో
సప్లిమెంటరీ పరీక్షల నిర్వహనకు నియామకమైన సీఎస్‌లు, డీవోలు, కస్టోడియన్లు, ఏఎస్‌వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్‌ఐవో, డీఈసీ కమిటీ కన్వీనర్ ఎ.అన్నమ్మ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో పరీక్షల నిర్వహన తీరుతెన్నులు, జాగ్రత్తలు తదితర అంశాలపై ఆమెతోపాటు డీఈసీ కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు.
పకడ్బందీగా పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్:ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ -2 పి.రజనీకాంతారావు అన్నారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం సంబంధిత ఆధికారులతో సమీక్ష నిర్వహించారు. మాస్ కాపియింగ్, అవకతవకలు జరగకుండా చూడాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టు మెంటల్ ఆధికారులు, పర్యవే క్షణలు చేయాలన్నారు. జంబ్లింగ్ విధానంలో భామిని నుంచి కొత్తూరు, కొత్తూరు నుంచి హిరమండలం, ఎల్‌ఎన్ పేట నుంచి హిరమండలం, పూండి నుంచి నౌపడ ఇలా కేంద్రాలను జంబ్లింగ్ చేసినట్టు చెప్పారు. సమావేశంలో ప్రాంతీయ పర్యవేక్షనాధికారి ఎ.అన్నమ్మ, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు బీవై భూషణరావు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు పూర్తి
Published Sat, May 23 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement
Advertisement