ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లో తలపెట్టిన అంతర్జాతీయ సదస్సు తడిసిన దీపావళి టపాసులా తుస్సుమంది. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది రైతులకు సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్న అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి.
సాక్షి, నెల్లూరు: ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లో తలపెట్టిన అంతర్జాతీయ సదస్సు తడిసిన దీపావళి టపాసులా తుస్సుమంది. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది రైతులకు సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్న అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. తొలు త సదస్సుకు ఆహ్వానం అందు కున్న రైతులను కాదని జిల్లాకు ఒక్కరికి మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఈ విషయాన్ని సదస్సు ప్రారంభానికి ఒక్కరోజు ముందు సంబంధిత అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. మిగిలిన రైతులు హైదరాబాద్ వచ్చినా స్టాల్స్‌కు పరిమితం కావాల్సిందేనని తేల్చారు. పై పెచ్చు సదస్సుకు హాజరయ్యే ఒక్కో రైతు రూ.5000 చొప్పున రుసుం చెల్లించాలని నిబంధనలు పెట్టడం విశేషం. ఏడాదిగా సదస్సుపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేశారు. దీంతో ఈ ప్రపంచ రైతుసదస్సుపై రైతులు ఆశలు పెంచుకున్నారు.
సదస్సు ఉపయోగకరంగా ఉంటుం దని భావించి తప్పక హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. తీరా ఇప్పుడు అక్కర్లేదంటూ అధికారులు ప్రకటించడంతో రైతులు నివ్వెర పోయారు. రైతులకు అవగాహన కల్పించనప్పుడు ప్రపంచ స్థాయి సదస్సు అని ప్రచారం చేయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ వ్యాపార సంస్థల కోసమే సదస్సు అని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రైతు సదస్సుకు జిల్లా నుంచి 80 మంది రైతులను తీసుకెళ్లేందుకు అధికారులు నిర్ణయించారు. సదస్సులో పాల్గొనే రైతులకు ఐడీ కార్డులు సైతం సిద్ధం చేశారు.
ఆరో తేదీన జిల్లా రైతులకు సదస్సు ఉంటుందని ప్రకటించడంతో ఐదో తేదీ రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరాల్సి ఉంది. తీరా బయల్దేరే ముందు కేవలం ఒకే ఒక్క రైతుకు మాత్రమే సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని ,మిగిలిన రైతులందరూ కేవలం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలకు పరిమితం కావాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. రైతులను అనుమతించనప్పుడు ఆర్భాటంగా ప్రపంచ స్థాయి రైతుసదస్సు జరపడం ఎందుకని జిల్లా రైతుసంఘాల సమాఖ్య నేత కోటిరెడ్డి ప్రశ్నించారు.