- ప్రశ్నపత్రాలు రూపొందించని ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు
- సమస్యలు పరిష్కరించాలని సహాయ నిరాకరణ
- ఆందోళనలో విద్యార్థులు
నూజివీడు, న్యూస్‌లైన్ : నూజివీడు ట్రిపుల్ ఐటీలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు వీటిని పరిష్కరించాల్సిన ఆర్జీయూకేటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అధ్యాపకుల సహాయ నిరాకరణతో ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం ఇంజినీరింగు విద్యార్థులకు నెలరోజులుగా వీకెండ్ (వారాంతపు) పరీక్షలు జరగడం లేదు. కొన్ని బ్రాంచీలకు ఒక్క మ్యాథ్స్ సబ్జెక్టుకు మాత్రమే నిర్వహిస్తుండగా, సివిల్, ఈసీఈ బ్రాంచీలకూ ఒక్క సబ్జెక్టుకు కూడా పరీక్షలు జరగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. లెర్నింగ్ బై డూయింగ్... టీచింగ్ బై హోంవర్క్ విధానంలో భాగంగా వీకెండ్, క్యాట్ పరీక్ష(నెలవారి)లు తప్పనిసరి. ఆ వారంలో పూర్తయిన సిలబస్‌కు సంబంధించి వీకెండ్ పరీక్షలను ప్రతి శనివారం నిర్వహించాలి. ఇందులో వచ్చిన మార్కులను పరిగణలోనికి తీసుకునే సంవత్సరాంతంలో విద్యార్థుల జీపీఏ(గ్రేడ్ పాయింట్ ఏవరేజ్)ను నిర్ణయిస్తారు.
మొండికేసిన అధ్యాపకులు !
ప్రశ్న పత్రాలను రూపొందించాల్సిన అధ్యాపకులు మొండికేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని తెలుస్తోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జనవరి నెలాఖరులో అధ్యాపకులు తరగతులకు వెళ్లలేదు.
వీసీ రాజకుమార్ వచ్చి మీడియాను కూడా రానీయకుండా రహస్య చర్చలు జరిపారు. అనంతరం అధ్యాపకులు తరగతులకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు తప్పితే.. పరీక్షలు పెట్టడం లేదని తెలుస్తోంది. తరువాత అన్నీ ఒకేసారి నిర్వహిస్తే తమపై ఒత్తిడి పెరుగుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
పరీక్షలు జరగని మాట వాస్తవమే
ఇంజినీరింగులో పలు బ్రాంచీలకు వీకెండ్ పరీక్షలు జరగని మాట వాస్తవమే. అధ్యాపకులు ప్రశ్నపత్రాల రూపకల్పనలో సహకరించకపోవడమే దీనికి కారణం. ప్రశ్నపత్రాలను ఇవ్వమని అధ్యాపకుల్ని కోరాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది.
-ఇబ్రహీంఖాన్, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్, నూజివీడు