పాలకులకు ఇవ్వాలి సమయం | Interview With Ganapathi Sachchidananda Swamiji | Sakshi
Sakshi News home page

పాలకులకు ఇవ్వాలి సమయం

Published Sun, Sep 1 2019 6:31 AM | Last Updated on Sun, Sep 1 2019 6:32 AM

Interview With Ganapathi Sachchidananda Swamiji - Sakshi

గీతంతో రాళ్లను కరిగించవచ్చనేది నానుడి.. రాళ్లను కరిగించడం ఏమో గానీ.. సంగీతంతో రోగాలు నయం చేయవచ్చని నిరూపించారు అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. నాదచికిత్సతో ఎన్నో రుగ్మతలను రూపమాపవచ్చని స్వామీజీ బోధిస్తుంటారు. స్వయంగా స్వరపరిచిన కీర్తనలను స్వామీజీ రాగయుక్తంగా ఆలపిస్తూ ఉంటే.. తన్మయత్వంలో మునిగితేలి శారీరక ఆరోగ్యం, మానసిక సాంత్వన పొందామని భక్తులు చెబుతుంటారు. పూజాదికాల్లో దత్త సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ పలు దేశాల్లో భారీ ఆంజనేయ, కుమారస్వామి విగ్రహాలు స్థాపించి హిందూమత పటిష్టానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న గణపతి సచ్చిదానంద స్వామీజీ విశాఖ జిల్లాకు విచ్చేశారు. అనకాపల్లి సమీపంలోని సిరనపల్లి చింతామణి గణపతి దత్త క్షేత్రంలో మూడురోజుల పాటు వేంచేసి ఉన్న స్వామీజీ శ్రీ గణపతి మహాయాగం,  శ్రీ గణేష పురాణ ప్రవచనంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.  ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై తనదైన భాష్యంతో పాటు ఆధ్యాత్మికత పేరిట ఆడంబరాలు ఎక్కువయ్యాయని స్వామీజీ వ్యాఖ్యానించారు. ఆ ధర్మ సూక్ష్మాలు, సూచనలు స్వామీజీ మాటల్లోనే...

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాలకులకు సమయమివ్వాలి. అధికారం చేపట్టిన వెంటనే రామరాజ్యం ఎలా వచ్చేస్తుంది.. మూడునెలలకే అద్భుతాలు ఎలా సాధిస్తారు.  గతంలో జరిగిన కుళ్లు అంతా పోగొట్టాలి.. ఆ తర్వాత పాలనపై దృష్టి సారించాలి. ఇందుకు పాలకులకు కచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి. ఇదేమీ మంత్రం, తంత్రం కాదు కదా.. మంత్రం ఫలించేందుకు, సిద్ధించేందుకే కాదు.. పఠించేందుకే సమయం పడుతుంది కదా.. మరి సుపరిపాలనకూ సమయమివ్వాలి కదా.. అప్పుడే అశాంతి. అసహనం వద్దు.. రాష్ట్రాలకు మంచిరోజులు వస్తున్నాయి.. అందరూ అనను గానీ ప్రజల్లో కొందరు తొందరపడుతున్నారు. ప్రజలు కూడా బాధ్యతగా ఆలోచించాలి. అన్నీ ప్రభుత్వమే చేయాలని చూడడం మంచి పరిణామం కాదు. ముందుగా ప్రజలు తామిచ్చిన తీర్పును గౌరవించాలి. ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించాలి. వారిని అగౌరవపరచడం సరికాదు. స్వార్ధచింతనలను, తొందరపాటును విడనాడాలి.

ఒక్క చెట్టు తొలగించాల్సి వస్తే ముందు పది మొక్కలు నాటాలి..
వృక్షాలను తప్పనిసరి పరిస్థితుల్లోనే తొలగించాలి.  అనివార్య పరిస్థితుల్లో  ఒక్క చెట్టు  తొలగించాల్సి వస్తే ముందుగా పది మొక్కలు నాటాలి. ఆ తర్వాతే చెట్టు తొలగించాలి.. మొక్కలు నాటడం అనేది ఓ ఉద్యమంగా చేపట్టాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.. గో హత్య  సమాజానికి అశుభమే.. ఇందులో మరో మాటకు అవకాశం లేదు. గోవులను రక్షించండి... గో సంపదతోనే దేశానికి సుభిక్షం సిద్ధిస్తుంది.

నిద్రపోయే ముందు సంగీతం వినండి..
సంగీతం వలన పాడిపంటలు బాగుపడతాయని, రోగాలు నయం అవుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. నాద చికిత్సతో ఎన్నో రుగ్మతలు రూపుమాపాం. నామ సంకీర్తనతో దేవుడినే ప్రసన్నం చేసుకోవచ్చు. అటువంటి సంగీతంతో ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. అంతెం దుకు.. నిద్రలేమి సమస్యతో ఎంతోమంది బాధపడుతుంటారు. అటువంటి వారే కాదు.. ఎవరైనా సరే నిద్రపోయే ముందు మంచి సంగీతం, భక్తిభావం కలిగిన సంగీతం వినండి.. ప్రశాంత చిత్తంతో నిద్రపోయి ఉదయం తేజోమయమమైన ఆలోచనలతో మేల్కొనండి.. వ్యక్తి వృద్ధి నుంచే సమాజ వృద్ధి మొదలవుతుంది.

దీర్ఘాయిష్షు కావాలంటే మితంగా తినండి.. మితంగా మాట్లాడండి..
ఇప్పుడు ప్రజలకు అంతా తొందర ఎక్కువైంది. అంతా వేగం.. వేగం అని పరిగెడుతున్నారు.. అల్పాయుష్కులై పోతున్నారు. దీర్ఘాయిష్షు కావాలంటే ముందు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతతకు డబ్బుతో సంబంధం లేదు. అధికారంతో సంబంధం లేదు. హోదా తోనూ సంబంధం లేదు. డబ్బు, అధికారం, హోదా ఉన్న వాళ్లలో చాలామంది కూడా ప్రశాంతంగా లేరు.. ప్రశాంతత, సంతోషం కావాలంటే మంచి ఆలోచనలు చేయండి.. దీర్ఘాయిష్షు కావాలంటే మితంగా తినాలి.. మితంగా మాట్లాడాలి.. మిత విహారమే చేయా లి... ఇలా అన్నింటా మితంగా ఉండి.. అన్నీ అదుపులో ఉన్న వారు కచ్చితంగా పరిపూర్ణ ఆయుష్షు పొందుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు.. ఇతర రోగులు  కూడా ప్రశాంతతతో ఆధ్యాత్మిక్మతను అనుసరిస్తే వందేళ్లకు పైగా జీవిస్తారు.

 ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం తప్పు..
ఇటీవల ఆధ్యాత్మికత ముసుగులో ఆడంబ రాలు ఎక్కువయ్యాయి..పెద్ద పెద్ద హోమాలు చేయించడం.. వేలు, లక్షలు తీసుకోవడం నా కు ఇష్టం లేదు. ఈ యజ్ఞం చేయి..మూడు లక్షలు ఖర్చవుతుంది.. నాలుగు లక్షలు ఖర్చవుతుంది అని చెప్పడం మొదటి నుంచి నా నైజం కాదు. అలానే  శని బాలేదు..రాహువు బాలేదు అని వేలకు వేలు కట్టాలని డిమాండ్‌ చేయడం తప్పు. భక్తులు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారి మాటలను తొందరగా వింటారు.. వారిని సన్మార్గంలో పెట్టాలే కానీ దోచుకోకూడదు. ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం సరికాదు. నా దృష్టిలో ఆధ్మాత్మికత వ్యాపారం కాకూడదు.

దైవనింద మహాపాపం..
దైవ నింద చేయడం మహాపాపం. ఇటీవల చాలామంది ఫ్యాషన్‌ కోసమో.. ప్రచారం కోసమో నాస్తికతపై మాట్లాడుతున్నారు. దేవుడి ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వారికి మర్యా ద ఇవ్వకపోయినా ఫరవాలేదు. వారిని లెక్క చేయకపోయినా ఫరవాలేదు.. దేవుడి పట్ల మాత్రం గౌరవం, భక్తి ఉండాల్సిందే.. ఆ భక్తే  వ్యక్తికీ, వ్యవస్థకీ.. దేశానికీ మొత్తంగా విశ్వానికే హితం.. శుభం.

చిన్నప్పటి నుంచి పిల్లల్లో భక్తిభావం పెంపొందింపజేయాలి..
మన కుటుంబాలు బాగుంటేనే ఊరు బా గుంటుంది. ఊరు బాగుంటేనే దేశం బాగుం టుంది. మన దేశం బాగుంటేనే భారతీయత వెల్లివిరిస్తుంది. ఇందుకు పిల్లలే పునాది. వారిలో చిన్నప్పటి నుంచే భక్తిభావం పెంపొందింపజేయాలి. సంస్కృతి, సంప్రదాయాలు అలవర్చాలి. విలువలు నేర్పాలి. భగవద్గీత పఠనం చేయించాలి. మాతృభాషపై గౌరవం పెంపొందించాలి. పెద్దల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడం నేర్పాలి. పిల్లలను తరచూ దేవాలయాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తీసుకువెళ్లాలి. 

నేను ఆధ్యాత్మికత వ్యాపారిని కాదు..
నన్ను సిద్ధుడనీ, వైద్యుడనీ, స్వామీజీ అని భక్తులు పరివిధాలుగా భావిస్తుంటారు. అది వారిష్టం.. నేను మాత్రం ఆధ్యాత్మిక వ్యాపారినైతే కాదు.. దశాబ్దాలుగా ఆధ్యాత్మిక గురువుగా ప్రయాణిస్తున్నాను.. ఇప్పటివరకు 80దేశాల్లో పర్యటించాను. ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలతో పా టు విదేశాల్లో ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలు నెలకొల్పాను. వచ్చే వారం కూడా అమెరికా వెళ్తున్నాను. అక్కడ చికాగోలో జరిగే గణపతి ఉత్సవాల్లో పాల్గొంటున్నాను.ప్రజల్లో ఆధ్మాత్మిక భావం తగ్గుతున్న క్రమంలో నా బాధ్యతగా ప్రజలకు ఆధ్యాత్మికతపై అవగాహన కలిగిస్తున్నాను.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement