ఇట్లు.. మీ విధేయులు | Introduction of two fresh crowds Division | Sakshi
Sakshi News home page

ఇట్లు.. మీ విధేయులు

Published Thu, Oct 17 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Introduction of two fresh crowds Division

 

=సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవించాలంటున్న బాలరాజు
=సీమాంధ్ర అభివృద్ధికి పోరాడాలంటున్న చిన్నమ్మ
=తాజాగా ఇద్దరి నోటా విభజన ఆలాపన

 
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : ‘కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి బాల రాజుకు ప్రజాభీష్టం కంటే పార్టీ నిర్ణయమే శిరోధార్యమైంది. తాజాగా వీరిద్దరూ కొత్త పల్లవి అందుకున్నారు. విభజన జరిగిపోయిందంటూ ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు.  కాంగ్రె స్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం తీసుకోవడానికి ముందు బాలరాజు సమైక్య రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధమని ప్రకటించారు.  తీరా ప్రజలు పట్టుబట్టితే రాజీనామా చేసేదే లేదని మాట మార్చారు.  

గిట్టని వారు తనను విభజన వాదిగా దుష్ర్పచారం చేస్తున్నారంటూ తెగ బాధపడ్డారు. తన రాజీనామాతో విభజన ఆగదని, తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడించడానికి పదవిలో వుండక తప్పదని మరోసారి పరస్పర విరుద్ధ ప్రకటనలు  చేశారు. బుధవారం ఆయన తన వాణి మరోసారి మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వున్న వారు సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని గౌరవించాలనీ, రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై పోరాడాలని సెలవిచ్చారు.

ఏజెన్సీలో ఇప్పటికీ గిరిజనులు సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో  కూడా మంత్రి  విభజన అనుకూల ప్రకటన చేయడం ద్వారా తనకు ప్రజల కంటే పార్టీయే ముఖ్యమనే విధంగా వ్యవహరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు సమైక్య వాదుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు శాసనసభ్యులు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు పార్టీ ఫిరాయిస్తారనే సంకేతాలు వున్నాయి. భవిష్యత్తులో పార్టీని చేతుల్లోకి తెచ్చుకునే వ్యూహంతోనే బాలరాజు అధిష్టాన విధేయుడిగా ముద్ర వేసుకునే పనిలో పడ్డారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
 
చిన్నమ్మదీ అదే దారి

 విభజన జరక్కూడదని కోరుకుంటున్నానని ప్రకటించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి సైతం బుధవారం విజయవాడలో విభజన అనంతర అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశానని ఇటీవల ఆమె ప్రకటించారు. అయితే ఈ రాజీనామాలన్నీ డ్రామాలే అనే విషయం తేలిపోయిన పరంపరలో ‘‘ సీమాంధ్ర ప్రయోజనాల కోసం పోరాడాలి’’ అని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆమె మనసులోని మాటను చెప్పకనే చెప్పాయి. 2014లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచే పోటీకి దిగుతానని మూడు రోజుల కిందట ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురందేశ్వరి ప్రకటించారు.

ఈ స్థానం నుంచి టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి పోటీ పడుతున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశంలో  పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుండేట్లుగానే ఆమె వ్యవహరించారు.  రాజకీయ ప్రయోజనం ఆశించే ఆమె పార్టీ పట్ల విధేయత చాటుకుంటున్నారనే అభిప్రాయాలు జనంలో వ్యక్తం అవుతున్నాయి. విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలోనూ సమైక్య ఉద్యమం రగులుతూనే వున్న సమయంలో ఆమె ఈ తరహా  వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీ వర్గాల్లోనే కలవరం పుట్టించింది.  చిన్నమ్మ కూడా విభజనకు జనాన్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement