సాక్షి, సంగారెడ్డి: బయోమెట్రిక్ అటెండెన్స్.. వేలిముద్రలు/ కనుపాప(ఐరిష్)ను స్కాన్ చేసి ధ్రువీకరించుకున్నాకే సంబంధిత ఉద్యోగి, అధికారి విధులకు హాజరైనట్లు నమోదు చేస్తుంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును నమోదు చేయడానికి ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇంత పకడ్బందీ ‘ఈ’ బయోమెట్రిక్ పద్ధతినే బురిడీ కొట్టించి విధులకు డుమ్మా కొట్టిన ఓ జిల్లా అధికారిణి అడ్డంగా దొరికిపోయారు. ఆరోగ్య శ్రీ మెదక్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సౌజన్య బయోమెట్రిక్ హాజరుకే ‘ట్రిక్కు’ చేసి విచారణ ఎదుర్కొంటున్నారు. మామూలుగా ప్రతి కార్యాలయంలోనూ బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదును ప్రారంభించడానికి ముందు ఉద్యోగులందరి నుంచి వారి వేలిముద్రలు/ఐరీష్‌ను తీసుకుని కంప్యూటర్‌లో భద్రపరుస్తారు.
ఆ తర్వాత ఉద్యోగులు తమ వేలిముద్రలు/ఐరీష్ వెబ్‌సైట్‌లో తన వేలి ముద్రకు బదులు తన కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి సంబంధించిన వేలిముద్రను ఎన్‌రోల్ చేయించారు. దీంతో ఆ ఉద్యోగి అధికారిక వెబ్‌సైట్‌లో డాక్టర్ సౌజన్య తరఫున అక్రమంగా చొరబడి(లాగినై) ఆమె విధులకు రాకపోయినా హాజరైనట్లు నమోదు చేసేవారు. హైదరాబాద్‌లో నివాసముంటూ మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సౌజన్య తరచుగా విధులకు గైర్హాజరయ్యేవారు. దీంతో తాత్కాలిక ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వచ్చే వారు రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఈ అంశం బయటకు పొక్కడంతో ఆమె వెంటనే నష్టనివారణ చర్యలకు సిద్ధమయ్యారు. ఇటీవల తన కుడి చేతి వేలిముద్రలను నమోదు చేయించారు. దీనికోసం ఎడమ చేయి విరిగిందని కారణం చూపారు.
ఈ అంశంతో పాటు పలు అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మ మంగళవారం ఆరోగ్యశ్రీ కార్యాలయాన్ని సందర్శించి డాక్టర్ సౌజన్య హాజరుకు సంబంధించిన సమాచారాన్ని సీడీల్లో తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులను నుంచి ముడుపులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలపై సైతం విచారణ జరుపుతున్నట్లు విచారణాధికారి డాక్టర్ పద్మ తెలిపారు. కాగా, ఈ అంశంపై ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సౌజన్య వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
బయోమె‘ట్రిక్కు’
Published Wed, Feb 19 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement