సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్ : దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్ల పంపిణీ విషయంలో నిర్వాహకులు అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారని మండల పరిధిలోని బుస్సాపూర్‌కు చెందిన లబ్ధిదారులు శనివారం స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బుస్సాపూర్ గ్రామానికి చెందిన 39 మంది మహిళలు దీపం పథకానికి ఎంపికయ్యారు. శనివారం గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు సిద్దిపేటలోని కావేరి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చారు. వాస్తవానికి దీపం కనెక్షన్‌కు రూ. 715 చెల్లించాల్సి ఉంది. అయితే ఏజెన్సీ నిర్వాహకులు రూ. 1050 చెల్లించాలని సూచించారు.
అయితే ఇచ్చిన డబ్బుకు రశీదు ఇవ్వాలని లబ్ధిదారులు కోరగా అందుకు నిర్వాహకులు నిరాకరించారు. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో బుస్సాపూర్ గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు ఏజెన్సీ నిర్వాహకులతో బేరసారాలకు దిగి రూ. 800గా ధరను నిర్ణయించారు. దీంతో లబ్ధిదారులు చేసేది లేక ఆ మొత్తాన్ని చెల్లించి కనెక్షన్ తీసుకున్నారు. ఈ విషయమై ఏజెన్సీ మేనేజర్ వెంకటేశ్వర్లను వివరణ కోరగా.. తాము లబ్ధిదారుల నుంచి రూ. 715 మాత్రమే తీసుకున్నట్లు వివరించారు. అందులో రూ. 445 రీఫిల్లింగ్, రూ. 170 సురక్ష పైపు, రూ. 50 డాక్యుమెంట్, రూ. 50 పాస్ బుక్ కోసం తీసుకుంటున్నట్లు తెలిపారు. సిలిండర్, రెగ్యులేటర్ ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆందోళనలో బుస్సాపూర్ గ్రామానికి చెందిన సుజాత, రేణుక, అమృతమ్మ, లక్ష్మి, లావణ్య, నజీమ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘దీపం’లో అక్రమ వసూళ్లు
Published Sun, Jan 12 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement