సాక్షి, సంగారెడ్డి: వంట గ్యాస్‌కు ఆధార్ అనుసంధానంపై గడబిడ కొనసాగుతోంది. నిబంధనలను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నెల రోజులవుతున్నా.. ఇంకా ఆ మేరకు ఆదేశాలు జారీ కాలేదు. దీంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. ఒకవేళ ‘ఆధార్’ లింక్ కొనసాగిస్తే వినియోగదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిలా ఉండగా వంట గ్యాస్‌కు ఆధార్ కార్డు అనుసంధానం గడువు శుక్రవారంతో ముగియనుంది.
ఆ తర్వాత గ్యాస్ కొనే వినియోగదారులు రాయతీ లేని వంట గ్యాస్‌ను కొనాల్సి ఉంటుంది. ఆధార్ అనుసంధానం నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్లు యూపీఏ సర్కార్ ప్రకటన చేసినా ఆదేశాలు మాత్రం జారీ కాలేదు. శుక్రవారం ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులకు రాయితీపై వంట గ్యాస్ సరఫరా నిలిచిపోనుం ది. రాయితీపై రూ.441కు లభిస్తున్న వంట గ్యాస్ రిఫిల్ కోసం ఈ వినియోగదారులు రూ. 1,220.50 చెల్లించాల్సిందే. ప్రభుత్వం నగదు బదిలీ పథకం కింద చెల్లిస్తున్న రూ. 740 రాయితీని నష్టపోవాల్సి ఉంటుంది.
జిల్లాలో 66 శాతం వినియోగదారులు ఇంకా ఆధార్‌తో అనుసంధానం కాలేదు. ఆధార్ ఉపసంహరణపై ఉత్తర్వులు జారీ అయ్యేవరకు వీరికి ఇక్కట్లు తప్పేటట్లు లేవు. ఉత్తర్వులు అందితేనే సబ్సిడీపై గ్యాస్ సరఫరా చేస్తామని గ్యాస్ కంపెనీలు, ఏజెన్సీలు తేల్చి చెప్పుతున్నాయి.
‘ఢీ’లర్లు
ఆధార్‌తో అనుసంధానానికి గడువు ముగియకముందే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు సబ్సిడీపై గ్యాస్ విక్రయాలను నిలిపివేశాయి. గ్యాస్ కంపెనీల నుంచి సబ్సిడీ గ్యాస్ సరఫరా లేదని సాకులు చెప్పి ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులను తిప్పి పంపిస్తున్నారు. గ్యాస్ కంపెనీలు డీలర్లకు సాధారణ సబ్సిడీ, నాన్ సబ్సిడీ అనే రెండు వేర్వేరు కోటాల కింద గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయి.
నాన్ సబ్సిడీ కింద సరఫరా చేసే గ్యాస్‌ను ఆధార్‌తో అనుసంధానమైన వినియోగదారులకు విక్రయిస్తుండగా.. సబ్సిడీ గ్యాస్‌ను అనుసంధానం కాని వినియోగదారులకు అందజేస్తున్నారు. అయితే, కొందరు డీలర్లు కంపెనీల నుంచి సబ్సిడీ కోటా గ్యాస్ కొనుగోళ్లను అప్పుడే నిలిపివేసి కేవలం నాన్ సబ్సిడీ గ్యాస్‌ను మాత్రమే వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. దీంతో ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులు తప్పనిసరి పరిస్థితిలో బ్లాక్‌లో గ్యాస్‌ను కొనుగోలు చేసి నష్టపోవాల్సి వస్తోంది.
ఇంకా ‘ఆధార’మేనా?
Published Thu, Feb 27 2014 11:29 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement