చెలరేగిపోతున్న ఇసుకాసురులు
Published Sun, Sep 22 2013 2:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :మూడు నదీపాయలతో ఉన్న కోనసీమలో ఇసుక అక్రమార్కులు ఇసుక నుంచి సొమ్ములు పిండుకునే అదను కోసం మాటు వేసుకుని ఉంటారు. నెల రోజుల్లో వరదలు వస్తాయంటే ముందే గోదావరి లోంచి ఇసుకను తవ్వేసి పర్వతాల్లాంటి గుట్టలుగా నిల్వ చేస్తారు. వారికి ప్రభుత్వ అనుమతులతో పనిలేదు. నిబంధనలన్నీ గోదావరిలో కలిపేస్తారు. ఇసుక అక్రమ తవ్వకాల సమయాల్లో అధికారులు అడ్డు తగిలితే మామూళ్లు ముట్టజెప్పి పబ్బం గడుపుకొంటుంటారు. అలాంటి అధికారులే సమైక్య ఉద్యమంతో ఇప్పుడు విధులకు దూరంగా ఉండడంతో అక్రమార్కులు ఆడింది ఆటగా ఉంది.
ఇదే అదనుగా అనుమతులు లేని రీచ్‌ల నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వేసుకుంటున్నారు. కొన్ని రీచ్‌లలో పగలు ఇసుక దోపిడీకి కొంత కట్టడి ఉంటున్నా రాత్రి సమయాల్లో అడ్డూఅదుపూ ఉండడం లేదు. కోనసీమలో లంకల గన్నవరం, ముంజవరం, పశువుల్లంక, బాడిలంక తదితర రీచ్‌ల్లో నిత్యం చీకటి పడితే చాలు ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు తెరలేస్తోంది. జిల్లాలో కొన్ని రీచ్‌లకు జూన్ పదో తేదీతో, మరికొన్ని రీచ్‌లకు ఆగస్టు 21తో గడువులు ముగిశాయి. కొద్ది రీచ్‌లు మాత్రమే అధికారిక అనుమతులతో నడుస్తున్నాయి. కోనసీమలో వీరవల్లిపాలెం, మఠం తదితర రీచ్‌లు అధికారికంగా సాగుతున్నాయి. అధిక రీచ్‌లపై కోర్టులకు వెళ్లటం, స్టేలు రావటం వంటి పరిణామాలతో అనుమతులు లేవు. దీంతో ఇసుకాసురులు అనుమతులతో పని లేకుండా గోదావరి గర్భాలను తవ్వేస్తున్నారు.
నదీపాయలు వారి సొంత జాగీర్లు
సమైక్యాంధ్ర ఉద్యమంతో అధికార యంత్రాంగం అజమాయిషీ అణువంత కూడా లేకపోవటంతో గోదావరి పాయలను తమ సొంత జాగీరుల్లా మలచుకుంటున్నారు. లంకల గన్నవరంలో ఇసుక వ్యాపారంలో తల పండిపోయిన ఓ బడావ్యక్తి కన్నుసన్నల్లోనే అక్రమ రవాణా సాగుతోంది. లంకల గన్నవరం, ముంజవరం, పశువుల్లంక రీచ్‌ల్లో రోజూ రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో తవ్వేసి, ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. ట్రాక్టరు ఇసుక ధర రూ.2500 పలుకుతోంది. కోనసీమలో వివిధ రీచ్‌ల నుంచి రోజూ రాత్రి సమయాల్లో దాదాపు 200 ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్టు అంచనా.
అంటే నిత్యం దాదాపు రూ.5 లక్షల విలువైన ఇసుక అక్రమార్కుల పాలవుతోంది. అధికారిక రీచ్‌ల నుంచి ఇసుక రవాణా అయితే బిల్లు ఇస్తారు. కోనసీమలో అనుమతులు లేని రీచ్‌ల నుంచి ఇసుక ఎలాంటి బిల్లులు లేకుండానే తరలిపోతోంది. జిల్లా అధికారులు యూనిట్ ఇసుక ధర రూ.1500 మించకూడదన్న ఆంక్షలు విధించారు. ఎలాంటి లెసైన్సులు లేకుండానే, ఎలాంటి వేలం పాటల లేకుండానే అనుమతులు లేని రీచ్‌ల నుంచి తవ్వేసిన ఇసుకను యూనిట్ ధర రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. ముంజవరంలో ఇసుక తవ్వకాలకు నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి అనుమతి ఇచ్చారంటూ చెప్పుకొంటూ
ఓ నాయకుడు అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు.
Advertisement
Advertisement