కాలవ ఇలాకాలో.. ఇసుక దందా | Sand robbery | Sakshi
Sakshi News home page

కాలవ ఇలాకాలో.. ఇసుక దందా

Published Tue, May 2 2017 1:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

కాలవ ఇలాకాలో.. ఇసుక దందా - Sakshi

కాలవ ఇలాకాలో.. ఇసుక దందా

  •  రెచ్చిపోతున్న అధికార పార్టీ నాయకులు
  • బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌ మండలాల నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా
  • చూసీచూడనట్లు స్థానిక అధికారులు, పోలీసులు
  • అప్రమత్తమైన బళ్లారి అధికారులు
  • ‘దుర్గం’ టీడీపీ నేతలపై కేసుల నమోదు 
  • డి.హీరేహాళ్‌ (రాయదుర్గం) :

    రాష్ట్ర గ్రామీణ గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకులు నదులు, వంకలు, వాగుల నుంచి ఇసుకను తవ్వి సరిహద్దులు దాటిస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరులో విక్రయిస్తూ భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని డి.హీరేహాళ్‌, బొమ్మనహాళ్‌ మండలాల్లో నదీ పరివాహక ప్రాంతాలను గుల్ల చేస్తున్నారు.

    బొమ్మనహాళ్‌ మండలం బండూరు, ఉద్దేహాళ్‌ గ్రామాల పరిధిలోని వేదవతి నది నుంచి, డి.హీరేహాళ్‌ మండలం బాదనహాల్‌ గ్రామం వద్దనున్న చిన్న హగరి నుంచి ఇసుక పెద్దఎత్తున కర్ణాటకకు తరలిపోతోంది. ప్రభుత్వం ఇసుకను ఉచితం చేయడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాత్రికి రాత్రే తోడేస్తూ ఒకచోట డంప్‌ చేసుకుని.. అక్కడి నుంచి బెంగళూరు, బళ్లారికి తరలిస్తున్నారు. బళ్లారిలో ట్రాక్టర్‌ ఇసుక రూ.5 వేలకు అమ్ముడుపోతోంది. బెంగళూరులో లారీ ఇసుక నాణ్యతను బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్ష వరకు అమ్ముడుపోతున్నట్లు సమాచారం. డి.హీరేహాళ్‌, ఓబుళాపురం గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం కోసమంటూ బాదనహాళ్‌ వద్ద నుంచి ఇసుకను తరలిస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఇళ్ల నిర్మాణాలు ఆ స్థాయిలో చేపట్టడం లేదు. అయినా అవసరానికి మించి అంటే రోజుకు  60 నుంచి 70 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఓబుళాపురం, డి.హీరేహాళ్‌ గ్రామాల సమీపాన కంపచెట్లలో డంప్‌ చేస్తున్నారు.

    అక్కడి నుంచి రాత్రి వేళలో జేసీబీలతో లారీలలో లోడ్‌ చేసి కర్ణాటక పర్మిట్లతో బెంగళూరుకు రవాణా చేస్తున్నారు. అక్కడ ఖర్చులన్నీ పోను ఒక్కో లోడ్‌పై రూ.70 వేల దాకా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. బొమ్మనహాళ్‌ మండలంలో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు క్రషర్‌ ముసుగులో కింద ఇసుకను, పైన కంకరపొడి వేసి తరలిస్తున్నట్లు వినికిడి. రాయదుర్గం పట్టణానికి చెందిన కొంత మంది భూపసముద్రం, కెంచానపల్లి తదితర ప్రాంతాల నుంచి ఇసుకను బెంగళూరుకు తరలించడమే పనిగా పెట్టుకున్నారు. గుమ్మఘట్ట మండలంలోని కలుగోడు, రంగచేడు, బీటీపీ, గుమ్మఘట్ట, భూపసముద్రం ప్రాంతాల్లో వేదవతి హగరి నదీ పరివాహక ప్రాంతం నుంచి నిత్యం ఇసుక తరలిపోతోంది. కణేకల్లు మండలంలోనూ ఇదే పరిస్థితి.

     

    బళ్లారి అధికారుల అప్రమత్తం

    రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతల ఇసుక దందా శ్రుతిమించిపోవడంతో సరిహద్దున ఉన్న బళ్లారి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. స్వయాన ఆ జిల్లాధికారి రామ్‌ ప్రసాత్‌ మనోహర్‌ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ఇటీవల బళ్లారి ఎస్పీ ఆర్‌.చేతన్‌తో కలిసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పలు వాహనాలను సీజ్‌ చేశారు. డి.హీరేహాళ్‌ మండలం చెర్లోపల్లి వద్ద నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గత నెల 25న బళ్లారి పోలీసులు సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి ఓబుళాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చిదానందగౌడ్‌, నాగరాజుపై కేసు నమోదు చేశారు. సరిహద్దున ఉన్న బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌ మండలాల నుంచే ఇసుక బళ్లారికి తరలివస్తోందని అక్కడి అధికారులు నిర్ధారించారు. 

     

    ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి: జయచంద్రారెడ్డి, రైతు సంఘం నాయకుడు, రాయదుర్గం నియోజకవర్గం

     ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే వేదావతి హగిరిలో ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భజలాలు అడుగంటాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement