
మృతదేహాన్ని బయటకు తీస్తున్న గ్రామస్తులు
సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకున్న ఆ కుటుంబాల్లో కనుమ రోజు విషాదం నిండింది. ఇసుకను ట్రాక్టర్‌కు లోడ్ చేసేందుకు వెళ్లిన ఇద్దరు కూలీలపై ఇసుక తిన్నెలు విరుచుకుపడ్డాయి. అందులో కూరుకుపోయి ఇద్దరు ఊపిరాడక మృతి చెందారు. ఇదే ఘటనలో మరొక కూలీ గాయాలతో బయటపడ్డాడు. పెనుకొండ మండలం మరువపల్లిలో ఈ ఘటన జరిగింది.
అనంతపురం, పెనుకొండ రూరల్: ఇసుక తిన్నెలు విరిగిపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. పెనుకొండ సీఐ రామకృష్ణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దుద్దేబండకు చెందిన వెంకటరెడ్డి (32), ఈడిగ వెంకటేష్ (43), మరో వ్యక్తి నాగభూషణ ముగ్గురూ కలసి బుధవారం ఉదయం ఇసుక తీసుకురావడానికి పెనుకొండ మండలం మరువపల్లి గ్రామ శివార్లలోకి చేరుకున్నారు. అక్కడి చెరువులో ఇసుక తవ్వుతుండగా ఒక్కసారిగా ఇసుక తిన్నెలు విరిగి కూలీలపై పడ్డాయి. వెంకటరెడ్డి, వెంకటేష్‌లు ఇసుకలో కూరుకుపోయి ఊపిరాడక ప్రాణం విడిచారు. ఇదే ప్రమాదంలో గాయపడి షాక్‌కు గురైన మరో కూలీ నాగభూషణ కాసేపటి తర్వాత తేరుకుని.. ఊరిలోకి పరుగులు తీసి సమాచారం చేరవేశాడు. గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పనిముట్ల సాయంతో ఇసుక తొలగించి రెండు మృతదేహాలను బయటకు తీశారు. బంధువుల రోదనలతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది. ప్రమాదంలో మృతిచెందిన ఈడిగ వెంకటేష్‌కు భార్య పద్మావతి, మతిస్థిమితంలేని కూతురు శిల్ప, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు. మరో మృతుడు వెంకటరెడ్డికి భార్య పుష్పావతి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్దలు మృతిచెందడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగాయి. అనంతరం సీఐ రామకృష్ణ, కియా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సుధాకర్ తమ సిబ్బందితో ప్రమాదస్థలిని పరిశీలించి, మృతదేహాలను ట్రాక్టర్‌లో పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
మరువపల్లిలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వెంకటరెడ్డి, ఈడిగ వెంకటేష్‌ల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శంకరనారాయణ డిమాండ్ చేశారు. పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. పిల్లల చదువులకు చేయూతనందిస్తామన్నారు. భవిష్యత్తులో కూడా వైఎస్సార్‌సీపీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట దుద్దేబండ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నాగలూరు బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.
నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి..
పెనుకొండ మండలం మరువపల్లి చెరువులో ఇసుక తరలి పోతోంది అని డిసెంబర్ 23న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఇష్టారాజ్యంగా జరుగుతున్న తవ్వకాలకు చెక్‌పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఇసుకతిన్నెలు విరిగిపడి ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఈ రోజు ఇంతటి విషాదం చోటుచేసుకునేది కాదని గ్రామస్తులు చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment