పగలూ.. రేయీ... ఇసుక భోజనం! | day and night sand meal | Sakshi
Sakshi News home page

పగలూ.. రేయీ... ఇసుక భోజనం!

Published Sat, Jan 30 2016 3:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

పగలూ.. రేయీ... ఇసుక భోజనం! - Sakshi

పగలూ.. రేయీ... ఇసుక భోజనం!

నెల రోజులుగా రాష్ట్రంలో అధికార పక్ష నేతల ఇష్టారాజ్యం
సీనరేజి ఫీజు, పర్మిట్ ఛార్జీలు చెల్లించకుండా సర్కారు ఆదాయానికి గండి

రేవుల నుంచి రేయింబవళ్లు నిరంతరాయంగా ఇసుక రవాణా
నేతలు, అనుచరుల ప్రైవేటు స్టాక్‌యార్డులకు తరలింపు
పట్టపగలే దోచుకుంటున్నా పట్టించుకోని అధికారులు
గత ఏడాది రూ.2000 కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని చెప్పిన ఆర్థికమంత్రి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దొంగలు పడ్డారు... పట్టపగలు, అధికారుల కళ్లముందే ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వచ్చే నెల నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో గత నెల రోజులుగా అధికార పక్ష నేతలు చెలరేగిపోయారు. డ్వాక్రా  సంఘాల ముసుగులో టీడీపీ నేతలు రేయింబవళ్లూ తేడాలేకుండా పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి, ఎలాంటి పర్మిట్లూ లేకుండానే లారీలు, ట్రాక్టర్లలో నింపి అక్రమంగా విక్రయిస్తున్నారు.

మరికొందరు మారుమూల ప్రాంతాల్లో రహస్యంగా ప్రైవేటు స్టాక్‌యార్డులు పెట్టి ఇసుక నిల్వ చేసి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని కొల్లిపర, ఉండవల్లి, పెనుమాక రీచ్‌ల నుంచి రోజూ వేలాది టన్నుల ఇసుక అడ్డదారుల్లో తరలిపోతోంది. డ్వాక్రా సంఘాల అధీనంలో లేని రేవుల నుంచి కూడా తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పెదపులిపాక, సెనగపాడుతోపాటు కృష్ణా నది రేవుల నుంచి అనధికారికంగా  తవ్వకాలు సాగుతున్నాయి.

ఈ మొత్తం వ్యవహారం మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తుండటంతో అధికారులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మరో పక్షం రోజుల్లో ఇసుక క్వారీల వేలం ప్రక్రియ పూర్తయి రేవులు కొత్త కాంట్రాక్టర్ల పరమవుతాయని తేలడంతో... చోటామోటా నేతలు కూడా అక్రమ తవ్వకాలను  సాగిస్తున్నారు. ఇలా ఈ రెండు జిల్లాల నుంచి రూ.50 కోట్ల విలువైన పది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక  తరలిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ తవ్వకాల్లో మంత్రులకే భాగస్వామ్యం ఉంటే ఇక ప్రశ్నించేదెవరని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

పట్టపగలే విశాఖ నగరానికి తరలింపు
శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదుల నుంచి విశాఖ నగరానికి నిత్యం వందకు పైగా లారీల ఇసుక వెళుతోంది. ఇందులో 80 శాతం పర్మిట్లు లేకుండా, సీనరేజి చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్నదేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ‘మంత్రి కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. వారిని అడ్డుకుంటే మంత్రి నుంచి ఫోన్ వస్తుంది. ఆయన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వాహనాలను వదిలేయక తప్పదు. దీనికంటే చూసీ చూడనట్లు వ్యవహరించడమే ఉత్తమం.

జిల్లాలోని అధికారులు అదే చేస్తున్నారు. కొందరు సిబ్బంది లంచాలు తీసుకుని ప్రేక్షకపాత్ర పోషిస్తే ఇంకొందరు పెద్దవాళ్లతో గొడవ ఎందుకన్న ధోరణిలో ఉంటున్నారు’ అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో ఈ నెలరోజుల్లో ఐదు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక తరలిపోయిందని అనధికార అంచనా. ప్రభుత్వ లెక్కల ప్రకారమే క్యూబిక్ మీటరుకు రూ.500 చొప్పున లెక్కిస్తే రూ.25 కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది.

ఇక విజయనగరం జిల్లాలోని నాగావళి , పంపావతి, సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి అధికార పక్ష ఎమ్మెల్యేల అనుచరులు, స్థానిక చోటామోటా నాయకులు, ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. లారీ లు, ట్రాక్టర్లలో తరలించి భారీగా సంపాదిస్తున్నారు. కొందరైతే నదుల నుంచి రాత్రి  వేళ ఇసుక తీసుకెళ్లి ప్రైవేటు స్టాక్ యార్డుల్లో నిల్వ చేసి కావల్సిన వారికి సరఫరా చేస్తున్నారు.

 అనంతపురం నుంచి కర్ణాటకకు...
అనంతపురం జిల్లాలోని చిత్రావతి, పెన్నా నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అధికార పక్షానికి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులు తమ అనుచరుల ద్వారా చిత్రావతిలో ఇసుక తవ్వించి కర్ణాటక రాజధాని బెంగళూరుకు తరలించి రూ. కోట్లు దండుకుంటున్నారు. మరో ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరులు ‘పెన్నా’ను అడ్డంగా తవ్వేస్తున్నారు.

 పట్టపగలు సీనరేజిగానీ, పర్మిట్లు గానీ లేకుండానే లారీల్లో ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ‘ఆ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగుతున్న అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకునే ధైర్యం ఎవరికి ఉంది? వారిని అడ్డుకుంటే తిట్లు భరించడమే కాకుండా దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. అందుకే అన్ని శాఖల అధికారులు కళ్లున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారు...’ అని ఆ జిల్లాకు చెందిన  ఒక అధికారి చెప్పారు. కర్నూలు జిల్లాలో కీలక నేత కుటుంబం కనుసన్నల్లో మూడు నియోజకవర్గాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.

కీలక నేత సోదరుల మాట ఈ ప్రాంతంలో అధికారులకు వేదంగా మారింది. దీంతో ఇసుక అడ్డగోలు దందా ‘మూడు ట్రాక్టర్లు... ఆరు లారీలు..’ చందంగా సాగుతోంది. ఈ రెండు జిల్లాలనుంచి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అధికభాగం బెంగళూరుకు తరలించి అధిక ధరలకు అమ్ముకున్నారని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలరోజుల్లో దోచుకున్న ఇసుకకు సీనరేజి ఫీజు, పర్మిట్ ఛార్జీలు చెల్లించకపోవడంతో ఖజానాకు దాదాపు రూ.200 కోట్లకు పైబడి గండి పడిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మామూలు రోజుల్లోనే అక్రమంగా ఇసుకను తవ్వేసుకున్న ఘనులు... ఇప్పుడు కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందన్న నేపథ్యంలో మరింత బరితెగించి దోచుకున్నారని వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గత ఏడాదిలో రూ.2000 కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలిపోయిందని చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement