జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.
విశ్వరూప్ చేరికతో మరింత బలపడ్డ వైఎస్సార్ సీపీ
Published Sat, Oct 19 2013 2:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యనేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుండడంతో ఇప్పటికే దిక్కుతోచని కాంగ్రెస్‌కు ఈ పరిణామం శరాఘాతమే. మరోపక్క కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చి చేరుతున్న నేతలతో వైఎస్సార్ కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రాష్ట్ర విభజనకు తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో కాంగ్రెస్ పునాదులు కదిలిపోతున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిష్టించిన నేతలు ఒక్కొక్కరూ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సమైక్యాంధ్రపై అధి ష్టానం నిర్ణయానికి నిరసనగా మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పినిపే విశ్వరూప్ శుక్రవారం జిల్లా పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి నాయకత్వాన జిల్లా నేతల సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశ్వరూప్‌కు జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. విశ్వరూప్ వైఎస్సార్‌సీపీలో చేరడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన విశ్వరూప్ పాతికేళ్లుగా రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. ముమ్మిడివరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనతో జనరల్‌కు మారడంతో ఎస్సీలకు రిజర్వు అయిన అమలాపురం నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయిన విశ్వరూప్ గ్రామీణ నీటిసరఫరా, పశు సంవర్థక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ అడ్డగోలు విధానాలకు నిరసనగా, మొదటి నుంచి సమైక్యాంధ్రపై స్పష్టమైన విధానంతో ఉన్న వైఎస్సార్‌సీపీపై, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్టు విశ్వరూప్ ప్రకటించారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్‌లో కొనసాగినా ‘మనిషి అక్కడ మనసు ఇక్కడ’ అన్నట్టు విశ్వరూప్ మొదటి నుంచి వైఎస్‌పై చెక్కుచెదరని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.
వైఎస్ మరణాంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో మంత్రి తోట నరసింహం వైఎస్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడి ఏరుదాటాక తెప్పతగలేసే రకం నాయకుడనిపించుకున్నారనే విమర్శను మూటగట్టుకున్నారు. అదే వైఎస్ ఆశీస్సులతో రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న విశ్వరూప్ ఏనాడూ వైఎస్‌ను పల్లెత్తు మాట అనకుండా హుందాగా వ్యవహరిస్తూ కృతజ్ఞత చాటుకుంటూ వచ్చారు. ఆ అభిమానమే ఈ రోజు తనను వైఎస్సార్‌సీపీలో చేరడానికి దోహదం చేసిందని విశ్వరూప్ పేర్కొంటున్నారు. జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం వైఎస్సార్‌సీపీపై అభిమానంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్‌గా జిల్లా నుంచి అదే సామాజికవర్గానికి చెందిన కొల్లి నిర్మల కుమారిని నియమించారు.
ఇప్పుడు ఆ సామాజికవర్గం నుంచి అటు కోనసీమలోను ఇటు జిల్లాలో మంచి పట్టున్న మరో ముఖ్య నాయకుడు విశ్వరూప్ వైఎస్సార్‌సీపీలో చేరడంతో పార్టీ మరింత బలీయం కానుంది. రాజోలు దీవిలో మంచి పట్టున్న మరో ముగ్గురు నాయకులు కూడా శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేర్చుకున్నారు. టీడీపీ, పీఆర్పీలో క్రియాశీలకంగా వ్యవహరించి తటస్థంగా ఉంటున్న మాజీ జడ్పీటీసీ కుచ్చర్లపాటి సూరపరాజు, రాజోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుబ్బల మనోహర్, మల్కిపురం మండల మాజీ ఉపాధ్యక్షుడు గెడ్డం తులసీభాస్కర్ పార్టీలో చేరారు. విశ్వరూప్ వెంట అమలాపురం నియోజకవర్గం నుంచి పలువురు పార్టీలో చేరారు. చేరిన వారిలో మాజీ కౌన్సిలర్ నాగారపు వెంకటేశ్వరరావు, అల్లవరం మాజీ ఎంపీపీ కొనుకు బాపూజీ, చెన్నకేశవస్వామి దేవస్థానం చైర్మన్ నల్లా శివాజీ, కోనసీమ రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి వాసంశెట్టి సత్య, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ డెరైక్టర్ గెడ్డం జీవన్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంసాని నాని, సుంకర సుధ తదితరులున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్‌లు చెల్లుబోయిన వేణు, మిండగుదిటి మోహన్, బొంతు రాజేశ్వరరావు, చింతలపాటి వెంకట్రామరాజు, గుత్తుల సాయి, అధికార ప్రతినిధి పీకె రావు, పార్టీ నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, జక్కంపూడి రాజా, తాడి విజయభాస్కరరెడ్డి, పెన్మత్స చిట్టిరాజు, వేగిరాజు సాయిరాజు తదితరులున్నారు.
Advertisement
Advertisement