నిర్మల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 52 మండలాల్లో మైనర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువుల కింద మొత్తం 330 సాగునీటి సంఘాలు ఉన్నాయి. అలాగే సరస్వతీ కాలువ కింద ఎనిమిది సంఘాలు ఉండగా, 1 డిస్ట్రిబ్యూటరీ, కడెం ప్రాజెక్టు కింద 24 సంఘాలు, 3 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. మూడేళ్ల నుంచి భారీ వర్షాలు, వరదల కారణంగా వీటి పరిధిలోని చెరువులు, కాలువలు చెడిపోయాయి. దీనికి సంబంధించి సరైన ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు మరమ్మతులపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2011 నుంచి నిలిచిపోయిన ఎన్నికలు..
ప్రతి రెండేళ్లకోసారి సాగునీటి సంఘాల ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. చెరువులు, కాలువల పరిరక్షణ, అభివృద్ధితోపాటు నిర్వహణలాంటి వ్యవహారాలలో వాటి పరిధిలోని ఆయకట్టుదారులందరికీ భాగస్వామ్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసింది. మొత్తం 11 మంది టీసీ సభ్యులను, ఒక అధ్యక్షున్ని సంఘ సభ్యులు ఎన్నుకుంటారు.
ఈ సభ్యులంతా ప్రతినెలా సంఘ సమావేశాలు ఏ ర్పాటు చేసుకొని పంటల పరిస్థితి, సాగునీటి వినియో గం, ఇబ్బందులపై చర్చించి తీర్మానాలను చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాలను ఎప్పటికప్పుడు నీటిపారుదలశాఖకు నివేదించి అవసరమైన మేరకు సహా యం తీసుకుంటారు. అయితే 2011 నుంచి ఎన్నికలు జరగకపోతుండడంతో ఆయకట్టుదారుల సమస్యలను పట్టించుకున్నవారే కరువయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటి వరకు రూపొందని ఎన్నికల కార్యాచరణ..
గత కొన్నేళ్ల నుంచి అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లాగే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణను కూడా ప్రభుత్వం వివిధ కారణాలతో నిర్వహించలేకపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించిన ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు కార్యాచరణను రూపొందించలేదు.
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నందున ఈ వేసవిలోగ కూడా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని చెబుతున్నారు. మొత్తానికి సాగునీటి సంఘాల ఎన్నికలు నిలిచిపోవడంతో నీటి వనరుల వినియోగంలోనూ, కాలువలు, చెరువుల మరమ్మతుల నిర్వహణలోనూ అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. పర్యవేక్షణ భాగస్వామ్యంలో సంబంధిత సంఘాలు లేకపోవడంతో నిధుల దుర్వినియోగం కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్దప్రాతిపదికన వేసవి కాలం పూర్తయ్యేలోపు ఎన్నికలు నిర్వహించాలని రైతాంగం కోరుతున్నది.
ఎన్నికలేనా..
Published Sun, Feb 9 2014 6:09 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement