
ఒక్క సీటైనా లేని బీజేపీతో చర్చలా?: జూపూడి
సోనియా, ప్రధాని రాష్ట్ర ప్రజలతో చర్చించరేం?: జూపూడి
ఎన్నికల సమయంలో తొందరెందుకు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీతో ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్ర భవిష్యత్తుపై విందు రాజకీయాల్లో చర్చించడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తుంటే ప్రధానిగాని, సోనియాగాంధీ గాని ఇక్కడి ప్రజలతో చర్చించకుండా బీజేపీతో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
విభజన బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందువల్ల ఈ విభజన బిల్లును ప్రజాస్వామ్య శక్తులన్నీ అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... లోపభూయిష్టమైన ఈ బిల్లును గట్టెక్కించేందుకు కాంగ్రెస్‌పార్టీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను పక్కకుపెట్టి కార్పొరేట్ కంపెనీలా పరుగులు తీస్తోంది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సైతం ఆర్టికల్ 371 (డి)ని సవరించాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశంపై న్యాయ సలహా కోరారంటేనే ఈ బిల్లు ఎంత తప్పుల తడకగాఉందో అర్థమవుతోంది.
సాధారణ ఎన్నికల షెడ్యూలు త్వరలో వెలువడుతున్న తరుణంలో మరో వారం రోజుల్లో ఇంటికి వెళ్లే ఈ ప్రభుత్వం విభజన బిల్లు విషయంలో ఎందుకు తొందరపడుతోంది? ఇదేమైనా దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అత్యవసరమైన బిల్లా..? లేక దేశంలో 60 కోట్ల జనాభా ఉన్న మహిళా సోదరీమణులకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లా..? ఎందుకంత తొందరపడుతున్నారు? వైఎస్ మరణానంతరం ప్రజల్లో ఉప్పొంగిన వైఎస్ సానుభూతిని దెబ్బ తీసేందుకు తొలుత తెలంగాణ చిచ్చు రాజేశారు. ఆ తరువాత టీడీపీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేశారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో నామరూపాల్లేకుండా చేయాలనే దుర్భుద్ధి, కుట్రతోనే ఇంత అప్రజాస్వామికంగా బిల్లును తీసుకొస్తున్నారు.
అసెంబ్లీకి ఈ బిల్లు వచ్చిన నాటి నుంచీ చర్చించడానికి ఇందులో ఏమీ లేదని తొలి నుంచీ వైఎస్సార్‌సీపీ చెబుతూ ఉన్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. చర్చ జరిపించి చివరికి వచ్చేటప్పటికి ఇది ముసాయిదా బిల్లే కనుక తిరస్కరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు నాటకాలాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి వీరిద్దరూ చేసిందేమీ లేదు. విభజన నిర్ణయం వెలువడినప్పటినుంచీ మా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. జైల్లో ఉండి కూడా దీక్షకు పూనుకున్నారు. లోక్‌సభను స్తంభింప జేసేందుకు బుధవారం ఆయన వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు.