ప్రధానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. కేంద్రమంత్రి లేదా ప్రధాని ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని నిర్వహించడంతోపాటు మిగతా అన్ని వర్గాలతో కూడా సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాంటి వాతావరణంలోనే విభజన నిర్ణయాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రధానికి బొత్స రాసిన లేఖను బుధవారం పీసీసీ వర్గాలు విడుదలచేశాయి.
రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం తీవ్రమైందని బొత్స పేర్కొన్నారు. ఆందోళనలు హింసాత్మక ఘటనలకు కూడా దారితీస్తున్నాయన్నారు. హైదరాబాద్, విద్య, ఉద్యోగ, ఉపాధి, నీరు, ఆదాయం వంటి అంశాలపై సీమాంధ్ర ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నందునే వారు సమైక్యతను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో అఖిలపక్ష భేటీ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా, అందరితో చర్చించాకే విభజన నిర్ణయాన్ని తీసుకున్నామన్న భావనను కల్పించాలన్నారు.