సూపర్ స్పెషాలిటీపై సమాధానం లేదు
మంత్రి కామినేని స్పష్టం చేయలేదని ఆర్కే వెల్లడి
మంగళగిరి: జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణంపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. శుక్రవారం శాసనసభ సమావేశ అనంతరం ఆయన ఫోన్‌లో సాక్షితో మాట్లాడుతూ జీరోఅవర్‌లో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్‌పై చర్చ జరిగిందన్నారు. చర్చల్లో భాగంగా మంగళగిరి టీబీ శానిటోరియంలో ఎయిమ్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు, మంత్రి స్థల పరిశీలన తదితర అంశాలపై జరిగిన చర్చలో తాను పాల్గొని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌పై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న టీబీ శానిటోరియంను వేరేచోటకు తరలించి సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తారా? లేక శానిటోరియంలోని ఖాళీ స్థలాల్లో నిర్మిస్తారా? అని ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మిస్తామని చెప్పారు కానీ మంగళగిరి టీబీ శానిటోరియంలో ఆస్పత్రి నిర్మాణంపై సమాధానం ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ఎయిమ్స్‌ను జిల్లాలో ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.