వైఎస్సార్ సీపీకి ఓటెయ్యడం నేరమా?
మార్కాపురం : ఆరు నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేస్తున్నారని మార్కాపురం మండలం చింతగుంట్లకు చెందిన దళితులు పులుకూరి వెలుగొండయ్య, రూతమ్మ, మరియమ్మ, కొండమ్మ, తదితరులు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి తాము ఓట్లు వేయలేదన్న కోపంతో తమపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇళ్లకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రిస్మస్‌కు స్వగ్రామానికి వెళ్తే 24వ తేదీ రాత్రి తమపై దాడికి ప్రయత్నించటంతో తప్పించుకుని మార్కాపురం పట్టణానికి వచ్చి బంధువుల ఇంట్లో తల దాచుకున్నామన్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన పొలాల్లో టీడీపీ నేతలు జేసీబీలతో గుంతలు తీయించారని, సాగు చేసుకునేందుకు కూడా పనికి రాకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయటమే తాము చేసిన నేరమా.. అని దళితులు ప్రశ్నించారు.
బాధితులకు అండగా ఉండాలి :ఆర్డీఓను కోరిన ఎమ్మెల్యే జంకె
చింతగుంట్ల దళితులకు అండగా ఉండాలని ఆర్డీఓను ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరారు. సోమవారం బాధితులతో ఆయన ఆర్డీఓను కలిశారు. వాటర్‌షెడ్ పథకం నెపంతో తమ పార్టీ కార్యకర్తల పొలాలను ప్రత్యర్థులు పొక్లెయిన్లతో త వ్విస్తున్నారని, పొలం గట్ల వెంబడి ఉన్న చిల్లకంపను వారే కొట్టుకుని అమ్ముకుంటున్నారని, ఈ సంఘటనపై విచారణ జరపాలని ఆర్డీఓను ఎమ్మెల్యే కోరారు.
బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపొద్దన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తానని, సర్వేయర్‌ను పంపించి పొలం హద్దులు చూపిస్తానని, వాటర్‌షెడ్ అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యేకు ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు మార్కాపురం ఎంపీపీ ఎల్.మాలకొండయ్య ఉన్నారు.