సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక ప్రముఖ కంపెనీకి నిర్మాణ పని అప్పగించినందుకు ఆ కంపెనీ నుంచి నేరుగా ముడుపులు తీసుకొని నాటి ‘ముఖ్య’నేత ఆదాయపన్ను శాఖకు అడ్డంగా దొరికిపోయారు. అమ రావతిలో రూ. 2,652 కోట్ల నిర్మాణ పనులను మూడు సంస్థలకు అప్పగిం చగా అందులో ఒక సంస్థ నుంచి తీసు కున్న అవినీతి సొమ్ముకు సంబంధించి ఆధారాలు దొరికినట్లు పేరు ప్రకటిం చేందుకు ఇష్టపడని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహించిన సందర్భంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నప్పుడు రూ. 150 కోట్లను ఒక కంపెనీ ఆ ముఖ్య నేతకు చెల్ళలించినట్లు నిర్ధారణ అయ్యిందని ఆ సీనియర్ అధికారి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. ఇటీవల ముంబైలోని ఆ ప్రముఖ నిర్మాణరంగ కంపెనీలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ తాము చేసిన చెల్లింపులకు సంబంధించి రూపొందించుకున్న లెడ్జర్ ఒకటి ఐటీ బృం దానికి చిక్కింది. ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లించారన్న స్పష్టమైన ఆధారాలు ఆ లెడ్జర్ ద్వారా లభించాయి. మొత్తం రూ. 2,652 కోట్ల పనులకుగాను సుమారు 20% అంటే 500 కోట్లు ముడుపులుగా ఇచ్చేందుకు మూడు సంస్థల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా బయటపడింది. అందులో భాగంగానే రూ. 150 కోట్లు నేరుగా చెల్లించినట్లు బహిర్గతమైంది.
బయటపడింది ఇలా...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక వ్యక్తులు, సంస్థలపై ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్య ఆదాయపన్ను శాఖ దాడులు చేసిన సందర్భం లోనే నగదు సరఫరాకు సంబంధించిన క్లూ ఒకటి లభించింది. ఐదు షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులో భారీగా డబ్బు జమ చేయడాన్ని ఆదాయపన్ను శాఖ సీరియస్‌గా తీసుకుంది. మామూలుగా అయితే కంపెనీల్లో డిపాజిట్లు, చెల్లింపులు ఎక్కువగా చెక్కులు లేదా ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంటాయి. కానీ ఈ షెల్ కంపెనీల ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై సంబంధిత వ్యక్తుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు దాదాపు అన్ని కంపెనీలపైనా ఇటీవల దాడులు నిర్వహించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారికంగా, అనధికారికంగా పనులు చేపట్టిన కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఆ దాడులు జరిగాయి. ఆదాయపన్ను శాఖ అనుమానాన్ని నివృతి చేసే ఆధారం ఒక నిర్మాణరంగ కంపెనీ రికార్డులను పరిశీలించినప్పుడు బయటపడింది. ఇదే విషయాన్ని ఈ నెల 11వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, దక్షిణ భారతదేశంలోని నిర్మాణరంగ కంపెనీలపై దాడులు నిర్వహించినప్పుడు రూ. 3,300 కోట్ల మేర పనులకు సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారించింది. వాటిలో చాలా వరకు ఆయా రాజకీయ పార్టీలకు విరాళంగా చెల్లించిన సొమ్ము కొంత ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్య నేతకు నేరుగా రూ. 150 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది.
ముఖ్య నేతకు ముందే తెలుసా?
ఆదాయపన్ను శాఖ దాడులను సదరు ముఖ్య నేత ముందే ఊహించారు. తనను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని ఊరూవాడా చాటుకున్నారు. ఈ దాడులను ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న సదరు ముఖ్య నేత... ఆ తరువాత మళ్లీ దాడులు జరుగుతాయన్న విషయం తెలిసి కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలతో రహస్య రాయబారం నడిపారు. తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించడానికి తెరవెనుక నాటకం రక్తి కట్టించారు. అయినా ఆదాయపన్ను శాఖ కేసును ఎప్పటికప్పుడు తిరగదోడుతూనే వచ్చింది. ఈ నెల మొదటి వారంలో మళ్లీ దాడులతో విజృంభించింది. ఈ దాడుల్లో తనకు రూ. 150 కోట్లు నేరుగా చెల్లించిన విషయం ఐటీ పసిగట్టిందన్న విషయమూ ముఖ్య నేతకు చేరింది. అయితే ఇది బయటకు రాకుండా ఉండటం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తదుపరి చర్య ఏమిటి?
ఆదాయపన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో ఓ ముఖ్య నేతకు రూ. 150 కోట్లు చేరాయని సీబీడీటీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఆదాయపన్ను శాఖపైనే ఉంది. లంచంగా పుచ్చుకున్న వ్యక్తిని విచారిస్తారా లేక కేసు నమోదు చేస్తారా వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే విషయాన్ని సాక్షి ప్రతినిధి తనకు తెలిసిన సీనియర్ అధికారి ఒకరిని అడగ్గా ఆయన స్పందిస్తూ ‘‘మామూలుగా ప్రాథమిక సమాచారం ఆధారంగా తదుపరి దర్యాప్తు చేపడతాం. లంచం ఇవ్వడానికి తీసుకున్న వ్యక్తితో లావాదేవీలు ఏమిటో పరిశీలిస్తాం. ఆ లావాదేవీల ఆధారంగా లంచం ఇచ్చిన వారిని విచారిస్తాం. వారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తాం. ఆ తరువాతే లంచం తీసుకున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చి విచారిస్తాం. ఈ ప్రక్రియకు కొంతకాలం పట్టొచ్చు’’ అన్నారు.
ఎల్లో మీడియా ఎందుకు వీరంగం వేయలేదు?
ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూపే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ పచ్చ మీడియా ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. తెరవెనక ముఖ్య నేత ఎవరో తెలియడం వల్లే సీబీడీటీ ప్రకటన వచ్చి నాలుగు రోజులైనా ఒక్క కథనాన్నీ వండి వార్చలేదు. ‘హమ్మ ముఖ్య నేతా’ అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురించలేదు. ఈ మొత్తం వ్యవహారంలో తేలు కుట్టిన దొంగలా పచ్చ మీడియా వ్యవహరిస్తోంది. ఇసుక కొరత, ఆంగ్ల మీడియం అంటూ ప్రత్యేక కథనాలతో ఊదరగొడుతున్న పచ్చ మీడియాకు రూ. 150 కోట్ల లంచం అంత ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ సొమ్ము ఎవరికి చేరిందో వాళ్లకు ముందే తెలిసినందువల్లే సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నుంచి అంత ముఖ్యమైన ప్రకటన వెలువడినా మౌనంగా ఉంటున్నాయన్నది అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment