
'రాజధాని భూముల్లో అగ్నిప్రమాదం పెద్దదేమీ కాదు'
కడప: తుళ్లూరు రాజధాని పంట పొలాల్లో జరిగిన అగ్నిప్రమాదం పెద్దదేమీ కాదని ఏపీ పోలీసు డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు వ్యాఖ్యానించారు. శుక్రవారం కడప పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మరో రెండు రోజుల్లో అగ్నిప్రమాదం కేసులో పురోగతి సాధిస్తామన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై డీఐజీ ఆధ్వర్యంలో టాస్కఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మావోయిస్టుల్లో అగ్రనేతలంతా ఎక్కువశాతం తెలుగువారున్నారని తెలిపారు. రాష్ర్టంలోకి మావోయిస్టులు ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని దేశానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నమన్నారు. అగ్రిగోల్డ్ కేసును సీఐడీకి అప్పగించినట్టు రాముడు తెలిపారు.నెల్లూరు జిల్లాలో సిమి ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు.