
ఇది జిఓఎం ఆఖరి సమావేశం కాదు: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పడిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) రేపటి సమావేశం ఆఖరి సమావేశం కాదని ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జిఓఎం సుదీర్ఘ సమావేశం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
ఈ ఉదయం కేంద్ర మంత్రులు జైరామ్ రమేష్, జైపాల్ రెడ్డి షిండేతో సమావేశమయ్యారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం(యుటి) చేయాలన్న ఆలోచనకు జైపాల్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10.30కు షిండేను కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని వారు షిండేను కోరారు. రేపు ఉదయం సీమాంధ్ర మంత్రులతో జైరాం రమేష్ సమావేశమవుతారు.
ఇదిలా ఉండగా, జిఓఎం తుది సమావేశం విషయమై సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ గతంలో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. అదే తుది సమావేశమని జైరాం రమేష్ అంటే, అది చివరిది కాదని షిండే చెప్పారు. మరికొన్ని సమావేశాలు జరుగుతాయని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా షిండే ఇది తుది సమావేశం కాదని చెబుతున్నారు.