
కన్నీటి కథ ఇది..
మన్యంలో వైద్య సేవలు కొనసాగుతూనే ఉంటాయి.. మలేరియాపై పోరుకు బహుముఖ వ్యూహం కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపున నిర్భాగ్యుల ప్రాణాలు నేలరాలిపోతూనే ఉంటాయి.
పాడేరు : మన్యంలో వైద్య సేవలు కొనసాగుతూనే ఉంటాయి.. మలేరియాపై పోరుకు బహుముఖ వ్యూహం కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపున నిర్భాగ్యుల ప్రాణాలు నేలరాలిపోతూనే ఉంటాయి. బుధ, గురు వారాల్లో ముగిసిపోయిన మూడు జీవితాలు ఈ దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నెలలు నిండకుండానే పుట్టిన ఇద్దరు పసికందులు... వీరికి జన్మనిచ్చిన తల్లి గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిన దయనీయ పరిణామాలు ఇక్కడి అభాగ్య పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మలేరియా మహమ్మారితోపాటు రక్తహీనత సమస్య కూడా తోడవడంతో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి సాక్షిగా వీరి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.
ముంచంగిపుట్టు మండలం లబ్బూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనగుమ్మ గ్రామానికి చెందిన సీసా నీలమ్మ (25) కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతోంది. ఆరు నెలల గర్భవతి కావడంతో ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది. స్థానికంగా వైద్యసేవలు అందకపోవడంతో ఈ నెల 20న కుటుంబ సభ్యులు ఆమెను ముంచంగిపుట్టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి మలేరియాగా నిర్ధారించారు.
మలేరియా నివారణకు మందులు ఇచ్చారు. అయినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. రక్తహీనత సమస్య తోడైంది. బుధవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తరలించారు. ఇక్కడ వైద్యాధికారి శ్రీనివాసరావు, మిగిలిన వైద్యులు అత్యవసర వైద్యం అందించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. బరువు తక్కువగా పుట్టిన వీరు అత్యంత బలహీనంగా ఉండటంతో వైద్య సేవలు కల్పించినా రాత్రి 11.30 సమయంలో మృతి చెందారు.
తర్వాత తల్లిపరిస్థితి కూడా విషమంగా మారింది. కేవలం 4 శాతం హిమోగ్లోబిన్ మాత్రమే ఉండడంతో అత్యవసరంగా ఓ యూనిట్ రక్తం ఎక్కించారు. ఇంకా రక్తం అవసరమైనా, ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఉన్నత వైద్యసేవలకు కేజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా గురువారం ఉదయం 11 గంటల సమయంలో నీలమ్మ మృతి చెందింది. మృత శిశువులకు తండ్రి పాడేరులో అంతిమ సంస్కారం నిర్వహించిన కాసేపటికే తల్లి కూడా కన్ను మూయడం అందరినీ కదిలించింది. తల్లితోపాటు కడుపులో ఉన్న బిడ్డలకు కూడా మలేరియా సోకడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అంటున్నారు.