కేంద్రం మళ్లీ అఖిలపక్షం సమావేశం పేరుతో రాష్ట్ర ఏర్పాటును సాగదీసే ప్రయత్నం చేస్తోందని జేఏసీ నాయకులు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి కమలాకర్‌రావు ఆరోపించారు.
సిద్దిపేట : కేంద్రం మళ్లీ అఖిలపక్షం సమావేశం పేరుతో రాష్ట్ర ఏర్పాటును సాగదీసే ప్రయత్నం చేస్తోందని జేఏసీ నాయకులు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి కమలాకర్‌రావు ఆరోపించారు. ప్రత్యేక రాష్ర్టం కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 1,399వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురైందని, సీమాంధ్ర పాలకులు దశాబ్దాల కాలంగా ఇక్కడి వనరులను కొల్లగొట్టారని ఆరోపించారు.
తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడానికి అలవాటు పడ్డ సీమాంధ్ర పాలకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని తెలిపారు. తెలంగాణ సాధించే వరకూ దీక్షలను విరమించేది లేదన్నారు. కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. పుల్లూరు గ్రామానికి చెందిన మహిళలు మంద ఎల్లవ్వ, బూదవ్వ, పద్మ, శాంతవ్వ, నర్సవ్వ, యశోద, కనకవ్వ, ఎల్లవ్వ తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి పలువురు టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు.