సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని విద్యాశాఖ మంత్రి పార్థసారధి హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 23న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి (జాక్టో) పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మండలి ప్రతినిధి బృందంతో మంత్రి మంగళవారం చర్చలు జరిపారు. చర్చలు ఫలించిన నేపథ్యంలో చలో అసెంబ్లీని వాయిదా వేయాలని జాక్టో నేతలు నిర్ణయించారు.
చర్చల్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, కమిషనర్ వాణీమోహన్, ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి,శ్రీనివాసులు నాయుడు, పి.రవీందర్, పుల్లయ్య, రవికిరణ్‌వర్మ, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, ఏపీటీఎఫ్(258) నేత పాండురంగవరప్రసాద్, ఏపీటీఎఫ్(1938) నాయకుడు హృదయరాజ్, పండితపరిషత్ నేత అబ్దుల్లా, పీఈటీ అసోసియేషన్ నాయకులు యాదయ్య, కరిముల్లారావు, ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ నేత దేశ్‌పాండే, హెడ్మాస్టర్ల సంఘం నేత శర్మ, ఆపస్ నేత సాయిరెడ్డి పాల్గొన్నారు.
మంత్రి ఇచ్చిన హామీలు ఇవీ..
- 2,500 మంది పండిట్లు, 2,500 మంది పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ త్వరలో ఉత్తర్వులు. మరో 5 వేల పోస్టుల అప్‌గ్రేడ్ చేయడానికి సీఎంకు ప్రతిపాదనలు.
- రూ. 398 వేతనంతో పనిచేసిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుకు వీలుగా సంబంధిత ఫైల్‌ను ఆర్థిక మంత్రి, సీఎంకు మూడు రోజుల్లోగా పంపించడానికి చర్యలు.
- పంచాయితీరాజ్, మున్సిపల్, ఎయిడెడ్ టీచర్లకు అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు.
- మండల విద్యాధికారులుగా ఆ మండలంలోని సీనియర్ స్కూల్ అసిస్టెంట్ నియామకం. హెడ్మాస్టర్లకు జిల్లా ఉప విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు ఇచ్చే అంశం పరిశీలన.
- ఎయిడెడ్ టీచర్ల జీతాల గ్రాంట్ ఈ నెలాఖరులోగా విడుదలకు చర్యలు. ఎయిడెడ్ పాఠశాలల్లో అప్రెం టీస్ విధానాన్ని రద్దు చేస్తూ త్వరలో ఉత్తర్వులు.
జాక్టోతో చర్చలు సఫలం
Published Wed, Jan 22 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement