మండపేట వైఎస్సార్ సీపీ అభ్యర్ధి బోస్‌ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ధాన్యం దళారీల పాలవుతున్న విషయాన్ని రైతులు నాతో చెప్పారు. ఆ రైతన్నకు మాట ఇస్తున్నా...అధికారంలోకి రాగానే మద్దతు ధర ఇచ్చే బాధ్యత నాదే. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. ఫీజులు కట్టేందుకు అప్పులు చేస్తున్న తల్లిదండ్రులను చూశా...పిల్లలు, తల్లిదండ్రులకు చెబుతున్నా...నేనున్నానని హామీ ఇస్తున్నా...ఆరోగ్యశ్రీని చంద్రబాబు కనుమరుగు చేశారు. ప్రతి పేదవాడికీ చెబుతున్నా...నేనున్నాని హామీ ఇస్తున్నా...
‘గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్‌పీసీ) సముద్రంలో డ్రిల్లింగ్ చేస్తే దానివల్ల 15 వేల మంది మత్స్యకారులు నష్టపోయారు. వారికి నెలకు రూ.6,750 చొప్పున 17 నెలలపాటు ఇస్తామని చెప్పి ఆరు నెలలకు మాత్రమే ఇచ్చారు. ఇంకా పదకొండు నెలలకు రూ.130 కోట్లు ఇవ్వలేదు. గోదావరి ఉంది కానీ తాగడానికి నీళ్లు లేవు. పక్కన గోదావరి కనిపిస్తుంది కానీ 68 గ్రామాలకు తాగడానికి నీళ్లు లేవు. వరి మద్దతు ధర చూస్తే రూ.1,550 ఉంది...కానీ క్వింటాల్‌కు వచ్చేది రూ.1,250 నుంచి 1,300లు. అంటే బస్తాకు కనీసం రూ.వెయ్యి కూడా రాని పరిస్థితి. గోదావరిలో సాగునీరు సక్రమంగా రాదు. పెట్రోలియం ఉత్పత్తులు పుష్కలంగా ఉన్నా కూడా ఇక్కడ నిరుద్యోగ యువకుల తలరాత మాత్రం మారదు. పోలవరం పూర్తికాలేదు. డెల్టా కాలువల ఆధునికీకరణ కూడా పూర్తికాదు. గోదావరి కరకట్టల నిర్మాణం పూర్తికాదు. లంక భూముల రక్షణ కోసం వేసే గ్రోయిన్ల నిర్మాణం కూడా పూర్తికాదు.’ ఇవన్నీ ముమ్మడివరం పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలని ప్రజలకు గుర్తు చేశారు. మీరు చెప్పినవన్నీ నేను విన్నాను. మీ బాధలు, మీ ఆవేదనను అర్ధం చేసుకున్నాను. మీ అందరికీ ‘నేను ఉన్నాను.
రైతుల పొట్టకొడుతూ ధాన్యం రవాణా పేరు మీద కూడా కోట్ల రూపాయలు తిన్నారు. కపిలేశ్వరపురం, కోరుమిల్లి, అచ్యుతాపురం, తాతపూడి నాలుగు రీచ్‌లలో వందల లారీలు పెట్టి ఇసుకను బాహాటంగా దోచుకున్నారు. అక్రమ రవాణాను అడ్డుకుంటే కేసులు పెట్టారు. నీరు–చెట్టు తవ్వకాల పేరుతో మట్టిని అమ్ముకున్నారు. తవ్వినందుకు బిల్లులు చేసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా అక్క, చెల్లెమ్మలకు ఇళ్లకు నోటీసులు అంటించి అవస్థలకు గురి చేశారు. ఇవన్నీ మండపేట నియోజకవర్గ పాదయాత్రలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అన్నీ విన్నాను. నేనున్నానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో ప్రజలు చెప్పిన బాధలను తెలియజేయడమే కాకుండా నాడు చెప్పిన సమస్యలను మరోసారి గుర్తుకు తెస్తూ, మీ ఆవేదనను మరిచిపోనని ముమ్మడివరం, మండపేట సభల్లో వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది.
జనంతో పోటెత్తిన సభలు
నడినెత్తిన సెగలు కురిపిస్తున్నా సూర్యుడిని లెక్క చేయకుండా...ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసినా ఏమాత్రం వెరవకుండా అభిమాన నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎదురు చూశారు. అక్కడికొచ్చే దారులన్నీ జనప్రవాహమయ్యాయి. ము మ్మిడివరంలో జనతరంగం కదం తొక్కగా, మండపేటలో జనప్రభంజనమైంది. అటు ముమ్మిడివ రం, ఇటు మండపేటకు నియోజకవర్గంలోని నలు మూలల నుంచి స్వచ్ఛందంగా జనం తరలిరావడంతో దారులన్నీ తిరునాళ్లను తలపించాయి. పాదయాత్రలో మీ కష్టాల్ని చూశా... మీ బాధలు విన్నా...ప్రతి కుటుంబానికీ చెబుతున్నా...నేను ఉన్నాను. మీకు అండగా ఉంటాననే సరికి జనం చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. ప్రజల పడుతున్న కష్టాలను...పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన అంశాలను గుర్తు చేసినప్పు డు జనం మోములో ఆనందం తొంగిచూసింది. ప్రత్యేక హోదా కోసం మాట్లాడినప్పుడు యువత హర్షధ్వానాలు తెలియజేయగా, నవరత్నాలను వి వరించినప్పుడు చప్పట్లతో జనం సంతోషం వ్య క్తం చేశారు. ఇరవై రోజులు ఆగితే మన ప్రభుత్వం వస్తుందని జగన్ అనగానే ‘జై జగన్, సీఎం సీఎం’ అనే నినాదాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment