తుపాను బాధితులను ఆదుకోండి | jaitley assured to help ap, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

తుపాను బాధితులను ఆదుకోండి

Published Sun, Nov 9 2014 1:07 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

తుపాను బాధితులను ఆదుకోండి - Sakshi

తుపాను బాధితులను ఆదుకోండి

కేంద్ర సాయం త్వరగా అందేలా చూడండి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం ఇచ్చిన జగన్
 
న్యూఢిల్లీ: హుద్‌హుద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రత్యేకించి విశాఖపట్టణం ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా మంజూరు చేసి, బాధితులకు సాయం అందించాలని కోరారు. జైట్లీ అన్ని అంశాలను సావధానంగా విన్నారని, సాయం అందిస్తానని హామీ ఇచ్చారని జగన్ తెలిపారు. జగన్ శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టారేణుకతో కలిసి సాయంత్రం 4-30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఢిల్లీ కృష్ణమీనన్‌మార్గ్-2లోని ఆయన నివాసంలో కలిశారు. హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని, తుపాన్లతో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఓ వినతిపత్రాన్ని అందజేశారు. దాదాపు అరగంటకుపైగా అన్ని అంశాలను జైట్లీ కి వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే...

 హుద్‌హుద్ తుపానుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదికలు పంపామని చెబుతున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము నిర్వర్తిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా బాధితులకు న్యాయం జరగాలన్నదే మా కోరిక.
 బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకువచ్చాం. తుపానుతో జరిగిన నష్టం, రాష్ట్రం ఎదురు చూస్తున్న సహాయం సత్వరమే అందించాల్సిందిగా అభ్యర్థించాం. ఆయన సావధానంగా విన్నారు. తప్పకుండా మంచి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కేవలం రూ. 450 కోట్లు మాత్రమే సాయం అందిందన్న అంశమూ మా చర్చలో వచ్చింది. ‘దీనికి సంబంధించి నివేదికలు ఇంకా పూర్తిగా తయారు కాలేదు. మా దగ్గరికి ఇంకా రాలేదు. వచ్చాక సాయం చేస్తాం’అని జైట్లీ చెప్పారు.

 రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పది రోజులపాటు ఊరూరు తిరిగి, ప్రభుత్వం ఆ గ్రామాల్లో ఏం చేయలేదో అందరికీ చూపిస్తూ, చెప్పుకుంటూ వచ్చాం. హుద్‌హుద్ తుపాను సహాయక చర్యల్లో సర్కారు విఫలమైందని నాతోపాటు తిరిగిన మీడియా వారి క్లిప్పింగులు చూస్తే తెలుస్తుంది. ఎలాంటి సహాయం అందడంలేదని ప్రజలే చెప్పారు. చంద్రబాబుగారేమో తుపాను సహాయంగా 25 కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చేస్తున్నానని చెబుతున్నారు. ఆ 25 కిలోల బియ్యం రేషన్ దుకాణాల్లో రూ.25కి ఇస్తారు. అంటే రూ.25 సాయం చేస్తున్నారు. అదికూడా అన్ని గ్రామాల్లో అందరికీ ఇవ్వలేదు. అధికారులెవరూ రాని పరిస్థితి.

చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో పంట బీమా రాక వారు నష్టపోయారు. ఈ విషయాలన్నీ ఆర్థిక మంత్రి దృష్టికి తెచ్చాం. ఈ రోజు కేవలం హుద్‌హుద్ బాధితుల సాయం అంశాన్ని మాత్రమే  మంత్రి దృష్టికి తెచ్చాం. ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు.
 
అరుణ్‌జైట్లీకి ఇచ్చిన వినతి పత్రంలోని ముఖ్యాంశాలు...
 
హుద్‌హుద్ తుపాను వచ్చిన మూడో రోజే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా రూ. వెయ్యికోట్ల సాయం ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధితులకు ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. నష్టపోయిన వారిలో 10 శాతం మంది రైతులకు సైతం నేటికీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అంద లేదు. నిర్వాసితులైన వారికి తిరిగి వసతులు కల్పించలేదు. బాధిత కుటుంబాలకు సాయం కింద అందించే బియ్యం పంపిణీలోనూ స్థానిక రాజకీయాలు పనిచేస్తున్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి.

ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే, టెలికాం, ఎయిర్‌పోర్టు, ఓడరేవు, షిప్‌యార్డ్, స్టీల్‌ప్లాంట్, బీహెచ్‌పీవీ లకు జరిగిన నష్టాన్ని కలిపితే ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రూ. 21,640.63 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక అందినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో వారికి పంట బీమా అందే పరిస్థితి లేదు. మీరు వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తే బాధితులకు కొంత ఊరట లభిస్తుంది. లేదంటే వారి జీవితాలు మరింత దయనీయంగా మారతాయి.

పంటలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న రైతులకు పంట రుణాలను, వడ్డీలను పూర్తిగా రద్దు చేయాలి. నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వచ్చే సీజన్‌కి సంబంధించి అవసరమైన రుణాలు కొత్తగా మంజూరు చేయాలి. తుపాన్ బాధిత ప్రాంతాల్లోని స్వయంసహాయ గ్రూపులకు ఎలాంటి వడ్డీలు లేకుండా రుణాలు రీషెడ్యూల్ చేయాలి. వచ్చే రబీకి అవసరమైన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. రైతులందరికీ పంటబీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలి. పాక్షికంగా దెబ్బతిన్న వరి, చెరుకు, ఉద్యానవన ఉత్పత్తులు సేకరించేందుకు హామీ ఇవ్వాలి.

హుద్‌హుద్ తుపాను సందర్భంగా అక్టోబర్ 2014న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 9, 10, 11, 12, 13, 15లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలివ్వాలి. బూపిందర్‌సింగ్ హుడా కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కౌలు రైతులను కలుపుకుని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా ప్రకృతి విపత్తు సహాయ నిధి నుంచి సాయం అందించాలి.

చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇచ్చిన ప్రకారం రూ. 5 లక్షల  పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. ఇల్లు దెబ్బతిన్న ప్రతీ కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం చేయాలి. ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం పశువులు చనిపోయినవారికి, కోళ్లు చనిపోయిన కోళ్ల ఫారాల వారికి నష్టపరిహారం అందజేయాలి. తుపాను ప్రాంతాల్లోని వారికి రేషన్‌ద్వారా అతి తక్కువ సహాయం చేసినందున ప్రతి ఇంటికీ రూ. 5 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి. బోట్లు, వలలు నష్టపోయిన మత్స్యకారులకు పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించాలి. వరద బాధిత ప్రాంతాల్లో భూమికోతను అరికట్టేందుకు, పూడిక తీతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement