కడప:జమ్మలమడుగులో ఎన్నిక ప్రక్రియను రేపటికి వాయిదా వేయడంతో వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ఎన్నిక ప్రక్రియను ప్రజాస్వామ్య పద్దతిలో పూర్తి చేయాలని ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలు డిమాండ్ చేశారు. తక్షణమే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక పూర్తిచేయాలని వారు ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. రేపటి వరకు వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లకు రక్షణ ఎవరు కల్పిస్తారని వారు ప్రశ్నించారు. కాగా, వైఎస్‌ఆర్‌సీపీ నేతల డిమాండ్‌ను పట్టించుకోని ఎన్నికల అధికారి రఘునాథరెడ్డి జమ్మలమడుగులో ఎన్నిక ప్రక్రియను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు.
ఎన్నిక ప్రక్రియను తక్షణం పూర్తి చేయాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కోరం ఉన్నా అక్కడ ఎన్నిక జరపకపోవడం ప్రజాస్వామ్య పద్దతి కాదన్నారు. దీనికి సంబంధించి మీడియాతో మాట్ల్లాడిన ఆదినారాయణ రెడ్డి.. టీడీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. టీడీపీ నేతలు జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నిక వాయిదా వేయించేందుకు కుట్ర చేశారని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇదే గదిలో బైఠాయిస్తామని హెచ్చరించారు.