జన్మభూమిని బహిష్కరించిన ఎమ్మెల్యే
ప్రభుత్వం తీరుపై సునీల్‌కుమార్ ఆగ్రహం
టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యుల వాగ్వాదం
సభను బహిష్కరించి జాతీయ రహదారిపై బైఠాయింపు
బంగారుపాళెం: జన్మభూమి సభలో ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే విమర్శించినందుకు టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే సభను బహిష్కరించి జాతీయ రహదారిపై బైఠాయించారు. బంగారుపాళెం మండలంలోని బలిజపల్లె పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన జన్మభూమి గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీపై ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, బ్యాంకు రుణాల మంజూరులో జన్మభూమి కమిటీ సభ్యులు, స్థానిక సర్పంచ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేశారు. రైతు రుణమాఫీ కింద 27 వేల కోట్లు రూపాయలను మాఫీ చేశామని చెబుతున్నా, వాస్తవానికి మాఫీ చేసింది 7.3 వేల కోట్ల రూపాయలేనన్నారు. డ్వాక్రా సభ్యుల ఖాతాలో ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు జమచేసినట్లు చెప్పిన ప్రభుత్వం మూడు వేల రూపాయలే జమ చేసిందన్నారు. ఈ వాస్తవాలను జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేపై మాటల యుద్ధానికి దిగారు. దీంతో గందరగోళం నెలకొంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోయారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ దొరస్వామి, ఎంపీటీసీ సభ్యులు స్వరూపాచిట్టి సభను బహిష్కరించారు.
జాతీయ రహదారిపై రాస్తారోకో
ఎమ్మెల్యేతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పంచాయతీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు.ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. జన్మభూమి ప్రత్యేక అధికారి ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి ఎమ్మెల్యే వద్దకు వచ్చి గ్రామసభకు రావాలని కోరారు. ఆయన నిరాకరించడంతో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతున్నపుడు తాము ఎదురు మాట్లాడలేదన్నారు. వాస్తవాలు మాట్లాడితే తెలుగుతమ్ముళ్లకు మింగుడుపడక తనపై మాటల వాదనలకు దిగారని మండిపడ్డారు.