ఓ కార్డు మంజూరైతే.. నిత్యావసర సరుకుల్లో కొన్నైనా చౌకగా దక్కి, బతుకుభారం కొంతైనా తగ్గుతుందన్నది బడుగుజీవుల ఆశ.
ఓ కార్డు మంజూరైతే.. నిత్యావసర సరుకుల్లో కొన్నైనా చౌకగా దక్కి, బతుకుభారం కొంతైనా తగ్గుతుందన్నది బడుగుజీవుల ఆశ. ఆ ఆశతోనే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుని, చేతికి వచ్చే రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ నిరీక్షణ ఎప్పుడు ముగుస్తుందో, కార్డులు మంజూరై, వాటి ద్వారా సరుకులు ఎన్నటికి అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దరఖాస్తుల స్వీకరణకు గతంలో రెండుమూడుసార్లు గడువు విధించిన ప్రభుత్వం.. ఇప్పటికీ ప్రహసనంగా స్వీకరణను కొనసాగిస్తూనే ఉంది. జన్మభూమి-మాఊరు గ్రామ సభలలో కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా గత నెలలో కూడా ఆర్భాటంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం మంజూరులో మాత్రం మందకొడిగా వ్యవహరిస్తోంది.
రామచంద్రపురం : గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన జన్మభూమి -మాఊరు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం గత నెలలో ప్రభుత్వం ఉగాది నాటికి నూతన రేషన్ కార్డులు అందిస్తామని అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. మొదట్లో గత నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించగా తిరిగి గడువు తేదీని 27కి పెంచుతున్నట్లు ప్రకటించినా, తహశీల్దార్ కార్యాలయాల్లో వీఆర్వోల ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతూనే ఉంది. దరఖాస్తులపై వీఆర్వోలు విచారణ నిర్వహించి కంప్యూటరీకరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2.14 లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్యాని అధికారులు చెబుతుండగా విచారణ అనంతరం 1.30 లక్షల దరఖాస్తులను మాత్రమే కంప్యూటరీకరించినట్లు తెలుస్తోంది.
కంప్యూటరీకరణలో మీనమేషాలు
ఒకవైపు దరఖాస్తులు తీసుకుంటూనే మరో వైపు వాటిపై విచారణ చేయటంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు పనులు తడి సి మోపెడవటంతో రేషన్ కార్డుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో దరఖాస్తు చేసుకున్న వెంటనే రేషన్‌కార్డు వస్తుందని ఆశపడ్డ వారికి నిరాశే మిగులుతోంది.
ఉద్దేశపూర్వకంగానే జాప్యం..
కొత్త రేషన్ కార్డుల జారీపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగో లేదంటున్న ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తే మరింత ఖర్చు అవుతందనే ఉద్దేశంతోనే జాప్యం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త దరఖాస్తుల ప్రకారం సుమారు 6 లక్షల యూనిట్లకు అదనంగా రేషన్ సరుకులు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ప్రతి నెలా అదనపు భారం పడనుండటంతోనే ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు కార్డులు ఎప్పుడు వస్తాయంటే పెదవి విప్పటం లేదు.
టీడీపీ నేతల జోక్యం
ఇదిలా ఉండగా రేషన్ కార్డుల దరఖాస్తుల దగ్గర నుంచి విచారణలో, కంప్యూటరీకరణలో టీడీపీ నాయకుల పైరవీలు ఎక్కువగా ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వారికి కొత్త రేషన్ కార్లు అందించేందుకు తహశీల్దార్ కార్యాలయాలకు, వీఆర్వోల వద్దకు వెళ్లి దరఖాస్తులను అందించి, దగ్గరుండి మరీ కంప్యూటరీకరణ చేయిస్తున్నారనే విమర్శలున్నాయి.