టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కేను?
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవి ఎవరిని వరించనుంది? ఈ పదవి కోసం అధికార పార్టీ నేతలు పలువురు పోటీపడుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎవరికి కట్టబెడతారనేది ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రధానంగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడులు రేసులో ఉన్నారు. రాయపాటికి నరసరావుపేట ఎంపీ టికెట్‌తో పాటు గెలిస్తే కేంద్రమంత్రి పదవి, ఓడితే టీటీడీ బోర్డు చైర్మన్ గిరి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని టీడీపీలోకి రప్పించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అలాగే అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జేసీనీ ఇదే రీతిలో టీడీపీలో చేర్చుకున్నట్లు ఆయన అనుయాయులు చెప్తున్నారు. రాయపాటి గతంలో అనేకసార్లు టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ఇపుడు టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన రాయపాటికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఒప్పందం మేరకు తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనంటూ చంద్రబాబుపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి శాసనసభ స్థానం నుంచి ఆరుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించిన జేసీ ఈసారి అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తానని ఇదివరకే బాబుతో ఒప్పందం ఉండడం వల్లనేమో జేసీ కూడా తనకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
తెరపైకి గాలి, చదలవాడ: టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరి శాసనసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చంద్రబాబును గాలి కోరుతున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకుంటే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని అడుగుతున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. తిరుపతి శాసనసభ స్థానం టికెట్ ఆశించి భంగపడ్డ చదలవాడ కృష్ణమూర్తి తనకే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ను కృష్ణమూర్తికి కాదని వెంకటరమణకు ఇచ్చారు. వెంకటరమణ విజయానికి సహకరిస్తే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తానని చదలవాడకు చంద్రబాబు ఆశచూపారు. వెంకటరమణ గెలుపుతో తనకే ఆ పదవి వస్తుందన్న నమ్మకంతో చదలవాడ ఉన్నారు. ఈ పదవికి డిమాండ్ ఎక్కువవటంతో చదలవాడ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. టీటీడీ పదవి ఇవ్వలేని పక్షంలో చదలవాడకు తుడా చైర్మన్ పదవితో సరిపెట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.