మరోసారి జేసీ సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు రూ.లక్షన్నర రుణమాఫీ చేస్తామని హామీ యిచ్చి.. ఇప్పటికీ చేయకపోవడంతో రైతులు ఆయనను తిట్టుకుంటున్నారని అన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే రుణమాఫీ దశలవారీగా చేస్తామని చెప్పారన్నారు.
చంద్రన్న సంక్రాంతి కానుక, రూపాయికే కిలో బియ్యం పథకాలు వృథా అని కొట్టిపారేశారు. ఈ పథకాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది కానీ ప్రజల్లో పార్టీకి గుర్తింపు రావడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంతో కూలీల కంటే ఫీల్డ్ అసిస్టెంట్లకే లాభం చేకూరుతోందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
మనం మహాత్మా శిష్యులం కాదని.. డబ్బు లేనిదే రాజకీయాల్లో మనుగడ లేదంటూ వ్యాఖ్యానించారు. సర్పంచ్ పదవి నుంచి ప్రధాని వరకు జరిగే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితేనే గెలుస్తారని ఈ సందర్భంగా జేసీ చెప్పారు.