కీలకమైన 57 రకాల విధులు నిర్వహిస్తున్న తమకు జూనియర్ అసిస్టెంట్ వేతన స్కేలును సిఫార్సు చేయాలన్న గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌ఓలు) విజ్ఞప్తికి పీఆర్సీ చైర్మన్ పి.కె. అగర్వాల్ సానుకూలంగా స్పందించారు.
డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన పీఆర్సీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: కీలకమైన 57 రకాల విధులు నిర్వహిస్తున్న తమకు జూనియర్ అసిస్టెంట్ వేతన స్కేలును సిఫార్సు చేయాలన్న గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌ఓలు) విజ్ఞప్తికి పీఆర్సీ చైర్మన్ పి.కె. అగర్వాల్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయరామారావు, ఉపేంద్రరావుల నేతృత్వంలోని ప్రతినిధులతో అగర్వాల్ శుక్రవారం చర్చలు జరిపారు.
ఇతర శాఖల ఉద్యోగుల విధులకంటే తమ విధులు కష్టమైనవని, తమ విధుల జాబితాలో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ తదితర విధులు ఉన్నాయని ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ‘ఇంటర్ విద్యార్హతగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు జూనియర్ అసిస్టెంట్ స్కేలు ఉంది. వీఆర్‌ఓలకు ఇంటర్మీడియెట్ విద్యార్హతగా నిర్ణయిస్తూ ప్రభుత్వం గతేడాది జీఓ ఇచ్చింది. వీట న్నింటినీ పరిగణనలోకి తీసుకుని మాకు జూనియర్ అసిస్టెంటు స్కేలును పీఆర్సీలో సిఫార్సు చేయండి’ అని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని అగర్వాల్ వారికి హామీఇచ్చారు.
‘రెవెన్యూ అధికారులకూ స్పెషల్ స్కేలు ఇవ్వాలి’
సాధారణ పరిపాలన శాఖలోని కొన్ని విభాగాల సిబ్బందికి ఇస్తున్న విధం గా రెవెన్యూ అధికారులకూ స్పెషల్ స్కేలు సిఫారసు చేయాలని పీఆర్సీ చైర్మన్ పి.కె. అగర్వాల్‌కు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్‌ఎస్‌ఏ) విజ్ఞప్తి చేసింది. తమ విజ్ఞప్తిపై అగర్వాల్ సానుకూలంగా స్పందించారని, వీలైన వరకూ మేలు జరిగేలా ప్రభుత్వానికి సిఫార్సుచేస్తామని హామీ ఇచ్చారని సంఘం అధ్యక్షుడు శివశంకర్ తెలిపారు.