ఉదయగిరి: జిల్లాలో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లలో అంతే లేదు. తీవ్ర ఆరోపణలు, కచ్చితమైన సమాచారమిస్తే తప్ప వారంతట వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై ఏసీబీ దృష్టిపెట్టడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మండలాలపై ఈ శాఖ దృష్టిసారించకపోవడంతో అక్కడ అవినీతి అధికారులతో కార్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణణాతీతం. అవినీతి శాఖ అధికారులు అడపాదడపా దాడులు చేసి కిందిస్థాయి సిబ్బందిని పట్టుకుంటున్నప్పటికీ, పైస్థాయి అధికారులపై దృష్టిపెట్టడం లేదు.
ఉదయగిరి చరిత్రలో లేనివిధంగా బుధవారం రాత్రి ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ శ్రీరామమూర్తిని దారికాచి ఏసీబీ అధికారులు దుత్తలూరు వద్ద పట్టుకొని పెద్ద మొత్తంలో సొమ్ము స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈప్రాంతంలో కొందరు అవినీ తి అధికారులు జనాలను పీల్చి పిప్పిచేస్తున్నప్పటికీ ఏసీబీ అధికారులు ఆవైపు కన్నెత్తిచూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ విషయంలో కూడా ఓ భూమి లావాదేవీలకు సంబంధించి గుంటూరుకు చెందిన ఓ పోలీసు అధికారి ఉండటంతో ఆయన ఒత్తిడి మేరకు ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.
కొనసాగుతున్న అవినీతి
జిల్లాలో వివిధ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. 2012లో 127 అవినీతి కేసులు నమోదుకాగా, 2013లో 8 కేసులు, 2014లో 11 కేసులు మాత్రమే నమోదుకావడం చూస్తే ఈ శాఖ పనితీరు స్పష్టంగా అర్ధమవుతోంది. అంటే అవినీతి జరగక కేసులు నమోదుకావడం లేదా, లేక అవినీతిపై ఏసీబీ దృష్టిపెట్టడం లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఏసీబీ డీఎస్పీగా జె.భాస్కరరావు ఉన్న సమయంలో జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఆయన పలు సంచలనాత్మక కేసులను నమోదుచేశారు. ఆయన బదిలీతో ఆశాఖ ఈ పరిస్థితి నత్తను తలపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో డీఎస్పీ పోస్టు ఖాళీగావుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు డీఎస్సీ డివిఎన్ మూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు సీఐ లు ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, పదిమంది కానిస్టేబుళ్లు ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతం లో వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పెద్ద చేపలను పట్టిన ఏసీబీ ఇప్పుడు నిద్రావస్థలో ఉండటానికి కారణమేమిటో అంతుచిక్కడం లేదు.
ఇప్పటికైనా నిద్రమత్తు వదిలేనా?
ప్రస్తుతం జిల్లాలో అన్ని శాఖల్లో అవినీతి విలయతాండవం చేస్తోంది. చిన్న పనికి కూ డా పెద్ద మొత్తంలో అప్పజెప్పందే పని కావ డం లేదు. దీంతో లంచం ఇచ్చుకోలేని అనేకమంది పేదవారు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి మిన్నకుండిపోతున్నారు. మరి కొంతమంది జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా నీటిపారుదల, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖల్లో చేయి తడపందే పనికావడం లేదని విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాలలో రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున లంచాలు గుంజుతున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. దుత్తలూరు, కొండాపురం, కలిగిరి, జలదంకి రెవెన్యూకార్యాలయాల్లో కూడా చేయి తడపందే పనులు కావడం లేదని ప్రజలు బోరుమంటున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం నుంచి అడంగళ్‌లో పేరు నమోదు వరకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఆత్మకూరు, గూడూరు, కావలి మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ఉలిక్కిపడ్డ ఉదయగిరి
ఉదయగిరి సబ్‌రిజిస్ట్రారు బుధవారం రాత్రి ఏసీబీకి పట్టుబడడంతో ఈ ప్రాంతంలో అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. గురువా రం నియోజకవర్గంలోని పలు కార్యాలయా ల్లో ఈ విషయం కలకలం సృష్టించింది. అనేకమంది అధికారులు, సిబ్బంది ముడుపుల విషయంలో జాగ్రత్తపడ్డారు.
అవినీతికి అంతేలేదు..
Published Fri, Feb 6 2015 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement