పేదలకు ఇంగ్లిష్‌ మీడియం అందకుండా కుట్ర | Justice Eswaraiah Comments On English Medium In School Education | Sakshi
Sakshi News home page

పేదలకు ఇంగ్లిష్‌ మీడియం అందకుండా కుట్ర

Published Sun, Dec 29 2019 4:10 AM | Last Updated on Sun, Dec 29 2019 7:49 AM

Justice Eswaraiah Comments On English Medium In School Education - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య తెలిపారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద, బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం విద్య దక్కుతుందనే దుగ్ధతో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సంపన్న వర్గాలవారు తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తూ.. బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్య అందకుండా అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. తద్వారా పేదలకు సమానత్వం దక్కకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

బలహీనవర్గాల పిల్లలు అభివృద్ధి చెందకూడదనేలా వీరి వైఖరి ఉందని ధ్వజమెత్తారు. మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడానికి ఇంగ్లిష్‌ మాధ్యమం దోహదపడుతుందన్నారు. ఎనిమిదో శతాబ్దంలో సంస్కృతంలో బోధించేవారని.. నాడు కింది స్థాయి వర్గాలకు సంస్కృత బోధన ఉండేది కాదని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను న్యాయస్థానాలు గౌరవించాలని, గతంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమం ప్రవేశపెట్టడంపై సర్వే నిర్వహించామన్నారు. ఇందులో ఎక్కువమంది ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని కోరుకున్నారన్నారు.

ఉన్నతవిద్య అభివృద్ధికి ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి
ఇంగ్లిష్‌ మీడియంలో చదివితేనే వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందుతారని, కాస్త దృష్టి పెడితే తెలుగు భాష కంటే ఇంగ్లిష్‌ నేర్చుకోవడమే సులువని జస్టిస్‌ ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. పేదరికంతో చాలామంది తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను పెంచి.. ఇంగ్లిష్‌లో బోధిస్తామని తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధి చెందాలంటే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. తాను ఇంగ్లిష్‌ మీడియంలో విద్యనభ్యసించి ఉంటే సుప్రీంకోర్టు జడ్జినయ్యే అవకాశం ఉండేదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అత్యవసరమన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు, పాఠశాలలు వారికయ్యే ఖర్చులను మాత్రమే విద్యార్థులు వద్ద ఫీజులుగా వసూలు చేయాలని కోరారు. కన్వీనర్, మేనేజ్‌మెంట్‌ కోటా ఫీజులను వేర్వేరుగా నిర్ణయిస్తామని, వీటి నియంత్రణపై ప్రతిపాదనల్ని ఫిబ్రవరి నాటికి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement