ఆంగ్ల మాధ్యమంతోనే విద్యార్థులకు మేలు | Good for students with English medium says Eshwaraiah | Sakshi
Sakshi News home page

ఆంగ్ల మాధ్యమంతోనే విద్యార్థులకు మేలు

Published Sun, Apr 26 2020 3:32 AM | Last Updated on Sun, Apr 26 2020 3:32 AM

Good for students with English medium says Eshwaraiah - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయిస్తేనే మన పిల్లలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకోగలుగుతారని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్, ఉమ్మడి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ‘ప్రపంచంలో ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్న వారికే అన్ని అవకాశాలు దక్కుతున్నాయి. మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇక్కడే పరిశ్రమలు పెట్టినవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిన వారందరూ చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారేనన్న విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల మాతృభాష తెలుగుకు ఎలాంటి ముప్పు రాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీనవర్గాలు, నిరుపేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందితేనే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమం ఉండాలో ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు బంగారు భవిష్యత్తు పొందాలంటే ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో తల్లిదండ్రులందరూ గుర్తించాలి’ అని జస్టిస్‌ ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. 

► స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లయినా ఇప్పటికీ బడుగు, బలహీనవర్గాలు, పేదలు  చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మాధ్యమంలోనే కొనసాగుతున్నాయి.
► డబ్బున్న వారి పిల్లలకే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం దక్కేలా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు ఏర్పాటు చేసుకోవడానికి గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయి.
► ఉన్నత వర్గాల వారు ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే ఎందుకు చదువుకుంటున్నారు? మాతృభాషకు ఏదో అయిపోతుందని అంటున్న వారంతా తమ పిల్లలను ఎందుకు ఆంగ్ల మాధ్యమ స్కూళ్లలో చదివిస్తున్నారో చెప్పాలి.
► తెలుగు తప్పనిసరిగా నేర్పిస్తూ ఆంగ్ల మాధ్యమం పెట్టడం వల్ల భాష మరింత అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా పిల్లలు తెలుసుకోవడానికి వీలు పడుతుంది.
► ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఆంగ్లంలో ప్రావీణ్యం చూపకపోవడానికి కారణం వారు చిన్నప్పుడు తెలుగు మాధ్యమంలో చదువుకోవడమే.
► ప్రైవేటు స్కూళ్లలో కంటే ప్రభుత్వ స్కూళ్లలో ఎంతో నైపుణ్యం ఉన్న టీచర్లున్నారు.
► ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉన్నా ప్రమాణాలు శూన్యం.
► ప్రైవేటు స్కూళ్లను ఏ జీవో ప్రకారం ఆంగ్ల మాధ్యమాలుగా కొనసాగిస్తున్నారో ప్రభుత్వం కూడా అదే జీవో ప్రకారం విద్యార్థుల అభిప్రాయాలకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమాలుగా మార్పు చేస్తే సరిపోతుంది.

ఇంగ్లిష్‌ వచ్చినవారికే ఉద్యోగాలు 
ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఆంగ్ల మాధ్యమం కావాలని అడుగుతున్నారు. ఇంతకుముందే పేరెంట్స్‌ కమిటీలు ఈ మేరకు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందించాయి. వారి అభీష్టం ప్రకారం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలి. గతంలో కూడా ఇంగ్లిష్‌ వచ్చినవారికే ఉద్యోగాలు, ఉపాధి లభించాయి.

మాతృభాషను ఇంట్లో నేర్చుకుంటారు
ఏ మాతృభాషనైన ఇంటిలో అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఎలాగూ నేర్చుకుంటారు. దాన్ని స్కూళ్లలో మాధ్యమాలుగా పెట్టనక్కరలేదు. దాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా నేర్పిస్తే చాలు. చాలా భాషలకు లిపి కూడా లేదు. ఆ పిల్లలంతా వారి మాతృభాషలోనే చదువుతున్నారా? వారికి ఇతర భాషా మాధ్యమంలోనే బోధిస్తున్నారు కదా! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement