శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి
హైదరాబాద్: చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాలకులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఎపీసీఎల్‌ఏ) ఆధ్వర్యంలో ‘‘మానవ హక్కులు.. సుపరిపాలన’’అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పాలకులను ప్రశ్నిస్తే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని, పైగా అభివృద్ధి నిరోధకులని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం, పాలకుల పనితీరు బాగుంటే ప్రజలు ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై కోర్టుకు వెళ్లే న్యాయవాదుల పట్ల పాలకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. శాసనసభలు, బహిరంగ సభల్లో కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు.
మేధావుల ఆలోచనలు విస్మరిస్తున్నారు
మేధావులు, నిపుణులు, సామాజిక కార్యకర్తల ఆలోచనలను ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేసిన చట్టాలను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు ప్రజా సమస్యలపై స్పందించాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ పెరిగిందని, ఇది పక్క రాష్ట్రాలకూ పాకిందని అన్నారు. పాలకులకు చట్టం లేదు, రాజ్యాంగం లేదని, ఫిరాయింపులే చట్టంగా భావిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి తీరని నష్టమని విమర్శించారు.
భూ నిర్వాసితుల చట్టం, సమాచార హక్కు చట్టాలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అన్నారు. సమాజంలోని పౌరులందరికీ సమాన హక్కులు లభించినప్పుడే సుపరిపాలన లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎపీసీఎల్‌ఎ రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరి సురేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సామాజిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment