రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ సాధన కోసం పార్టీలకతీతంగా రాజకీయ జేఏసీగా ఏర్పడాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి కోరారు.
రాజధాని సాధన కమిటీ సమావేశంలో వక్తల పిలుపు
సాక్షి ప్రతినిధి,కడప: రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ సాధన కోసం పార్టీలకతీతంగా రాజకీయ జేఏసీగా ఏర్పడాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి కోరారు. మంగళవారం కడపలో రాయలసీమ రాజధాని సాధన కమిటీ ఆధ్వర్యంలో విసృ్తత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ సీమ వాసులు నాడు మద్రాసును, కర్నూలు రాజధానిని, నేడు హైదరాబాదును త్యాగం చేశారని వివరించారు. ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో ఇంకా అట్టడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే విలువైన ఎర్రచందనం వైఎస్సార్ జిల్లాలో ఉందని, దీనిని ఈ ప్రాంతం అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘సీమ’ ప్రాంతానికి చెందిన 52 మంది శాసనసభ్యులతోపాటు నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు చెందిన వారు తమ భవిష్యత్తు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ‘సీమ’లో రాజధాని సాధన కోసం తమవంతు కృషి ఉంటుందన్నారు. కాగా, విజయవాడను తాత్కాలిక రాజ ధానిగా చంద్రబాబు ప్రకటించడం వెనక కుట్ర దాగి ఉందని లక్ష్మణ్‌రెడ్డి ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.