సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛందంగా సామాజిక సేవ చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) కృషి శ్లాఘనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి కొనియాడారు. సామాజిక సేవ చేసేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 29 వరకు నాటా ఆధ్వర్యంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాల ముగింపు సభ ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, అమెరికాలో క్షణం తీరిక లేకుండా గడిపే తెలుగువారు పుట్టిన గడ్డపై మమకారంతో పలు సామాజిక సేవలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వాలే అన్నీ చేయలేవని, స్వచ్ఛంద సంస్థలు కూడా సామాజిక సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంక టరమణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనివార్యమని, అయినప్పటికీ తెలుగువారు రెండు రాష్ట్రాల్లోనూ కలసిమెలసి ఉంటారన్నారు. ప్రముఖ వ్యాపార వేత్త సజ్జల దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ‘సహీ’ సంస్థ పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందన్నారు. చెవిటి పిల్లల సహాయానికి, వారి ఆరోగ్యం బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల సంరక్షణ కోసం వైద్యపరీక్షలు, యంత్రాల పంపిణీ లాంటివి చేపడుతున్నామని తెలిపారు. 20 ఏళ్లుగా ఇంగ్లండ్‌లో ఉన్న తాను మాతృభూమిపై మమకారంతో ఇక్కడకు వచ్చి అధునాతన టెక్నాలజీతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మ్యాక్సి విజన్ గ్రూప్ అధినేత డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి తెలిపారు. నాటా సేవలు అభినందనీయమని సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. తెలుగు ప్రజల సేవే నాటా లక్ష్యమని నాటా అధ్యక్షుడు డాక్టర్ టి.సంజీవ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ నెల 16 నుంచి చేపట్టిన కార్యక్రమాల్లో రూ.3.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. అనంతరం, రూ.70 లక్షల చెక్కును సజ్జల దివాకర్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రాంబాబులకు నాటా నిర్వాహకులు అందించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుభాష్ రెడ్డి, డాక్టర్లు మల్లారెడ్డి, సంజీవ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డికి నాటా లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును, శేఖర్ కమ్ముల, ఎమ్మెల్సీ వి.నారాయణ రెడ్డిలకు నాటా ఎక్సలె న్సీ అవార్డులను ప్రదానం చేశారు.
వ్యాపార వేత్త సజ్జల దివాకర్ రెడ్డి, నాటా అధ్యక్షుడు డాక్టర్ సంజీవ రెడ్డి తదితరులను సత్కరించారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా, నాటా సేవా డేస్ ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నిర్వహించిన ‘సేవ్ గర్ల్ చైల్డ్’ అవగాహన నడక కార్యక్రమంలో మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ బాలికల పట్ల వివక్ష కొనసాగుతోందని, దీనిని నిర్మూలించాలని అన్నారు. వైద్య రంగంపై నిర్వహించిన సదస్సులో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ మాట్లాడారు.