
కదం తొక్కిన మురికివాడ వాసులు
తామున్న చోటే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైల్వే న్యూకాలనీ ఇందిరాగాంధీ కాలనీ వాసులు మంత్రి గంటాశ్రీనివాసరావు ఇంటిని మంగళవారం ఉదయం ముట్టడించారు.
- మంత్రి గంటా ఇల్లు ముట్టడి
- ఉన్న చోటే ఇళ్లు కట్టివ్వాలని ఇందిరాగాంధీ కాలనీవాసుల డిమాండ్
- పక్కా ఇళ్ల హామీతో ఆందోళన విరమణ
విశాఖపట్నం: తామున్న చోటే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైల్వే న్యూకాలనీ ఇందిరాగాంధీ కాలనీ వాసులు మంత్రి గంటాశ్రీనివాసరావు ఇంటిని మంగళవారం ఉదయం ముట్టడించారు. ఎంవీపీ కాలనీలో మంత్రి ఇంటి వద్ద ఆందోళనకారులనుద్దేశించి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ 70 ఏళ్ళుగా ఇందిరాగాంధీ కాలనీలో ఉంటున్న మురికివాడవాసులను ఖాళీ చేయాలంటూ జీవీఎంసీ నోటీసులు జారీ చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
అక్కడే నెహ్రూ పథకం కింద పక్కా ఇళ్లు నిర్మించాలని, మిగిలిన వారికి జ్ఞానాపురం లారీస్టాండ్ ప్రాంతంలో నిర్మించిన నెహ్రూ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం జీవీఎంసీ కమిషనర్‌తో ఈ విషయమై చర్చిస్తామని హామీ ఇచ్చిన మంత్రి గంటా ఆ హామీని విస్మరించినందుకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడించామని లక్ష్మి పేర్కొన్నారు. ఆందోళనకారులు శాంతించకపోవటంతో జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, చీఫ్ సిటీప్లానర్ వెంకటరత్నం, జోన్-4 జోనల్ కమిషనర్ నాగనరసింహారావులను మంత్రి గంటా అక్కడికి రప్పించారు.
అనంతరం మంత్రి ఆందోళనకారులతో మాట్లాడారు. మురికివాడ స్థలంలోనే లేఅవుట్ వేసి పక్కా ఇళ్లు నిర్మించాలని, మిగిలిన వారికి జ్ఞానాపురం లారీస్టాండ్‌లోని నెహ్రూ ఇళ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీనితో ఆందోళనకారులు శాంతించారు. కార్యక్రమంలో మురికివాడల నివాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.రవి, ప్రధాన కార్యదర్శి కె.నిర్మల, ఐఎఫ్‌టీయూ ప్రతినిధి మల్లయ్య, భారత నాస్తిక సమాజం ప్రతనిధి నూకరాజు, అరుణోదయ సంస్థ నుంచి వెంకటలక్ష్మి, ఇందిరాగాంధీ కాలనీ హరిజనసేవా సంఘం నాయకులు ఈ.లక్ష్మి, దాలమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.