ఈ నెల 7న కడప విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో మరో విమానాశ్రయం రాకపోకలకు సిద్ధమైంది. ఈ నెల 7న కడప విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవనున్నారు. బెంగళూరు నుంచి బయల్దేరే తొలి విమానం ఉదయం 11.30 గంటలకు ఈ విమానాశ్రయంలో దిగనుంది.
ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు పౌర విమానయాన సేవల్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎయిర్‌పోర్టు అథారిటీ.. ఈ ఎయిర్ పోర్టును రూ. 42 కోట్లతో అభివృద్ధి చేసింది. ఏటీఆర్-72 కేటగిరీ విమానాల రాకపోకలకు వీలుగా రన్‌వేని నిర్మించారు. ప్రయాణికుల వృద్ధిని బట్టి దీనిని ఏ-320 తరహా విమానాల రాకపోకలకు వీలుగా దీనిని నవీకరిస్తారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లోని ఎయిర్‌పోర్టులు సేవలు అందిస్తుండగా వీటి సరసన తాజాగా కడప నగరం చేరనుంది.
2008లో తొలివిడత పనులకు శ్రీకారం...
కడప విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో నెలకొల్పేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో శ్రీకారం చుట్టారు. తొలుత రూ. 34 కోట్లు అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. 2008 జూన్‌లో తొలివిడత పనులకు శ్రీకారం చుట్టారు. 1,060 ఎకరాల పరిధిలో రక్షణ గోడ, 6 వేల అడుగుల రన్‌వే తొలివిడతలో పూర్తి చేశారు.
2010 అక్టోబర్ 10న రూ. 13 కోట్లతో రెండవ విడత పనులు చేపట్టారు. 2012 జూన్‌కు పనులన్నీ పూర్తి అయ్యాయి. కారణమేమిటో తెలియదుకాని కిరణ్ సర్కార్, అనంతరం చంద్రబాబు ప్రభుత్వం పలుమార్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ ప్రాంతవాసుల కల నెరవేరనుంది.