
హైబ్రిడ్ నిమ్మ మొక్క,కాగితం పూలు
పార్వతీపురం : పూలంటే మహిళలకు ప్రాణం. మూరెడు మల్లెపూలు ముడుచుకుని మురిసిపోతారు. కనీసం ఒక గులాబీనో, చామంతో.. బంతో చివరికి మందార పువ్వయినా ముడవనిదే వారికి సంతృప్తి ఉండదు. అలాంటిది.. కడియం పూల మొక్కలు కాళ్ల దగ్గరే వాలితే ఇంకేముంది. పరుగులు పెడుతూ నచ్చిన మొక్కలను కొనుగోలు చేసుకుంటూ పూల మొక్కలపై వారికున్న ప్రేమను చాటుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన పూలమొక్కల వ్యాపారి జి.సత్యనారాయణ 22 ఏళ్లుగా పార్వతీపురంలో పూల మొక్కల వ్యాపారం చేస్తున్నారు.
పలు రకాల వృక్షజాతులు, వివిధ రకాల పూల మొక్కలను పార్వతీపురం మండలం వెంకంపేట గోరీల కూడలిలో విక్రయిస్తున్నారు. ఇక్కడ హైబ్రీడ్ పూణె, గులాబీ, బెంగళూరు గులాబీ, కోల్‌కత్తా గులాబీ, తెల్ల గులాబీ, కాశ్మీర్ గులాబీలతో పాటు పదిహేను రకాల మందార మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, ఆరంజ్, యాపిల్ రేగు, జంబో నేరేడు, స్వీట్ నిమ్మ, మునగ, ఉసిరి, సపోటా వంటి పండ్ల రకాలను కూడా విక్రయిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు పట్టణ ప్రజలు ఎగబడుతున్నారు.
ఇంటి ఆవరణనే పూలతోటలుగా మలిచి ఆకర్షణగా తీర్చిదిద్దడం సాధారణమైంది. నిన్నటి వరకు పట్టణానికి పరిమితమైన వాతావరణం ఇప్పుడు పల్లెలకు పాకుతుండటంతో పూల మొక్కలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. మొక్కలను మంచి గిరాకీ ఏర్పడుతుండటంతో వ్యాపారులు కూడా వినియోగదారుల కోరిక మేరకు అరుదైన పూలు, పండ్ల రకాల మొక్కలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీరి వద్ద రూ.20 నుంచి రూ.500 విలువైన పలు రకాల మొక్కలు లభిస్తున్నాయి.
వేసవిలో కష్టం
ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి మొక్కలను సులువుగా పెంచవచ్చు. అదే వేసవి కాలంలో అయితే మొక్కల పెంపకం కష్టంతో కూడుకున్న పని. వర్షాకాలంలో ఎక్కువ రకాల మొక్కలను వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దిగుమతి చేస్తున్నాం. వేసవిలో నీరు లేక మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున కొన్ని రకాల్నే అందుబాటులో ఉంచుతున్నాం. ప్రజలు కొత్త రకాల మొక్కలను కోరుకుంటున్నారు. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి మొక్కలను తడపాల్సి వస్తుంది. ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తే ఇతర రాష్ట్రాలు, దేశాల మొక్కలను కూడా దిగుమతి చేసుకునే వీలుంటుంది. – సత్యనారాయణ, వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment