సాక్షి, హన్మకొండ : ఎట్టకేలకు కాకతీయ ఉత్సవాలు పునః ప్రారంభం కానున్నా యి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు గణపురం మం డల కేంద్రంలోని గణపేశ్వరాలయం (కోట గుళ్లు)లో ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27న హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్న ఉత్సవాలకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డితోపాటువరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ జి.కిషన్, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ హాజరుకానున్నారు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఉత్సవాలు పునఃప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి స్థానిక కళాకారులకు పెద్దపీట
కాకతీయ ఉత్సవాల్లో భాగంగా స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో స్థానికేతరులకే పెద్దపీట వేశారు. 2012 డిసెంబర్‌లో జరిగిన ప్రారంభోత్సవంలో రాధారాజారెడ్డి, ఎల్లా వెంకటేశ్వర్లు వంటి ప్రసిద్ధులు. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరోసారి జరిగిన ఉత్సవాల్లో పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ ఆనందశంకర్ వంటి స్థానికేతరులైన జాతీయ స్థాయి కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కిం ది. అరుుతే ఈ సారి గతానికి భిన్నంగా స్థానిక కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిం చారు. బుక్క సాంబయ్య, ఆజ్మీర గోవింద్‌నాయక్, పోరిక శ్యాం, నారగోని విశ్వనాథం, వెంకట్రాం నాయక్, గడ్డం సారయ్య వంటి జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారులు తమ బృందాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజుల వేడుకల్లో జిల్లాకు చెందిన 300 మంది కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు చుక్కా సత్తయ్య బృందం.. శివసత్తుల ప్రదర్శన ఇవ్వనుంది.
వీడని నిధుల గ్రహణం
ఏప్రిల్‌లో కాకతీయ ఉత్సవాలు జరిగాయి. నాలుగు నెలల విరామం తర్వాత కాకతీయ ఉత్సవాలు పునఃప్రారంభమవుతున్నా... నిధులకు గ్రహణం వీడలేదు.కాకతీయ ఫెస్టివల్ నిర్వహణకు నిధుల కేటాయిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో 2012 డిసెంబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ప్రతి నెలా ఉత్సవాల నిర్వహణ కష్టంగా మారింది. చివరకు కాకతీయ ఫెస్టివల్‌లో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు పారితోషికం చెల్లించలేని స్థితి ఏర్పడింది. ఫలితంగా మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని వాయిదా పడగా.. మరి కొన్ని రద్దయ్యూరుు. ప్రస్తుతం రూ. 30 లక్షలు విడుదలైనప్పటికీ ఇందులో సగానికి పైగా నిధులు కళాకారుల పారితోషికాలకే సరిపోతాయి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో డిసెంబర్ వరకు నిరాటంకంగా ఉత్సవాల నిర్వహణ జిల్లా యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారే అవకాశం ఉంది.
కార్యక్రమ విశేషాలు
కుప్ప పద్మజా బృందంలో మొత్తం 12 మంది సభ్యులున్నారు. డి ప్రవళిక, ఆర్.నిమిష, ఎల్.హర్షిణి, బి.శ్వేత, కె.కల్యాణి, ఎ.అనుశ్రీ, పి.చైతన్య, కె.ప్రణవ, పి.సౌందర్య, జి.వర్షిక, సహ్యూలతో కూడిన బృందంతో 45 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ బృందంలోని సభ్యులందరూ వరంగల్ జిల్లాకు చెందిన వారే. కన్నా సాంబయ్య బృందం వీర బ్రహ్మేంద్రస్వామి జననం బుర్రకథ ఉంటుంది. కన్నా సాంబయ్యతోపాటు ఎం.సదానందం, ఆర్.అశోక్ ఉన్నారు. ఈ కళారూపం గంటపాటు ఉంటుంది.
కోటగుళ్లలో ఏర్పాట్లు పూర్తి
గణపురం : కాకతీయ ఉత్సవాల నిర్వహణకు గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు ముస్తాబయ్యూరుు. ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ఉత్సవాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్న ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ రెండు పర్యాయాలు గణపేశ్వరాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతిఒక్కరికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమాలు నిర్వహించే వేదికతోపాటు సౌండ్స్, లైటింగ్, తాగునీటి వసతి, ఉత్సవాలకు వచ్చే కళాకారులు, అతిథులకు చేసే ఏర్పాటపై సోమవారం సాయంత్రం ఎంపీడీఓ గుళ్లపల్లి విద్యాసాగర్, తహసీల్దార్ రజితతో ఐటీడీఏ పీఓ మాట్లాడారు. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యూయని అహ్మద్‌కు వారు తెలిపారు.
కాగా, మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో దేవాలయ ప్రాంగణంలో అక్కడక్కడ నీరు నిలిచింది. దీంతో తహసీల్దార్ రజిత పర్యవేక్షణలో సిబ్బంది 150 ట్రాక్టర్ల మొరం తెప్పించి బురద గుంటలను పూడ్చారు.మట్టి కోట చుట్టు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు మూడు రోజులుగా 300 మంది కూలీలతో పనులు చేయించారు. ఇదిలా ఉండగా, విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌కో అధికారులు రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా మూడు జెనరేటర్లను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలకు వచ్చే సందర్శకుల కోసం ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో 10 మరుగుదొడ్లను నిర్మించారు. కేటీపీపీ అధికారులు మూడు రోజులపాటు ప్రతి రోజు 20 వేల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు.
నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
Published Tue, Sep 24 2013 3:55 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement