
కప్పట్రాళ్ల హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు
కర్నూలు: కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి 21 మందిని దోషులుగా నిర్థారించారు. ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా... 21 మందికి జీవిత ఖైదు విధించారు.
2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో కోడుమూరుకు బయలుదేరారు. ఆయన్ని హత్య చేయాలని పథకం పన్ని న ప్రత్యర్థులు ముందుగానే మాచాపురం వద్ద మాటు వేశారు. అటుగా వస్తున్న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు. (చదవండి: కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్)
దీంతో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి కుమారుడు ప్రత్యర్థి వర్గంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 48 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పత్తికొండ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే నిందితుల భద్రత దృష్ట్యా ఆదోని జిల్లా సెషన్స్ కోర్టుకు మార్చాలని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ హత్య కేసు ఆదోని సెషన్స్ కోర్టుకు మారింది. దాదాపు ఆరేళ్లు విచారణ అనంతరం కోర్టు తుది తీర్పును బుధవారం వెలువరించింది. పోలీసు కేసు నమోదు చేసిన 48 మందిలో నలుగురు అనారోగ్యంతో మృతి చెందారు.