విజయవాడ: బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్‌ను శుక్రవారం కాపు, బీసీ సంఘాల నేతలు కలిశారు. కాపులను బీసీల్లో చేర్చాలని కాపు నేతలు, మరోవైపు కాపులను బీసీల్లో చేర్చొద్దని బీసీ నేతలు పోటాపోటీగా వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం కాపు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారని కాపు సంఘాల నేతలు నరహరిశెట్టి నరసింహరావు, ఆకుల శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు...
కాపులను బీసీల్లో చేర్చవద్దని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్‌ను బీసీ సంఘాలు కోరాయి. వారిని బీసీల్లో చేర్చితే బీసీలు అన్ని విధాలుగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాపులు ఆర్థికంగా ఎంతో ఉన్నతిలో ఉన్నారంటూ బీసీల స్థితిగతులపై మంజునాథ కమిషన్‌కు బీసీ సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు వై.కోటేశ్వరరావు, సాంబశివరావు మాట్లాడుతూ కాపు, బీసీల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చు పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓట్లు కోసమే కాపులను బీసీల్లో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. కులాల కుంపటిలో చంద్రబాబు మాడి మసైపోతారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్తామని తెలిపారు.