కాపు నేతలపై కేసులు నమోదు
పిఠాపురం : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో దీక్షలు చేపట్టిన పలువురు కాపు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిఠాపురం పట్టణంతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో సుమారు 250 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండగా ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు, నిరసనలు జరిపి చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కొద్దిసేపు కాపు నాయకులకు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది.
అరట్లకట్టలో 43 మందిపై..
కరప : అరట్లకట్టలో దీక్షలు చేపట్టిన 43 మందిపై కరప పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరిపై కేసులు నమోదుచేసినట్టు ఏఎస్సై అడబాల గంగరాజు తెలిపారు. గోపాలపురంలో రావులపాలెం : గోపాలపురం కాపు కల్యాణ మండపంలో శుక్రవారం రిలే దీక్షలు చేపట్టిన 12 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై పీవీ త్రినాథ్ శుక్రవారం తెలిపారు. వీఆర్వోలు ఇచ్చిన నివేదిక మేరకు ఆకుల రామకృష్ణ, మరో 11 మంది పై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
వాడపాలెంలో 12 మందిపై..
కొత్తపేట : వాడపాలెంలో దీక్షలు చేపట్టిన కాపు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా నిబంధనలు ఉల్లంఘించారని ఎస్సై డి.విజయకుమార్ తెలిపారు.