కేసీకి కోతలు.. | kc canel story ended... | Sakshi
Sakshi News home page

కేసీకి కోతలు..

Published Tue, Dec 23 2014 2:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కేసీకి కోతలు.. - Sakshi

కేసీకి కోతలు..

కేసీ కెనాల్ కథ ముగిసింది. కర్నూలు-కడపజిల్లాల్లో సుమారు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన కేసీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది.

సాక్షి, కడప: కేసీ కెనాల్ కథ ముగిసింది. కర్నూలు-కడపజిల్లాల్లో సుమారు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన కేసీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీరు సక్రమంగా రాకపోగా.... తుంగభద్ర నీరు రావడం కూడా గగనమైంది. కేటాయింపుల్లో పారదర్శకత లోపించడం, ట్రిబ్యునల్ ప్రకారం కేటాయించిన నీటి కోటాలోనూ కోతలు... వెరసి దశాబ్దాలుగా కర్నూలు, కడప రైతుల పొలాలను తడిపిన కేసీకెనాల్ నిరుపయోగంగా మారనుంది. దాని ఉనికికే ప్రమాదం వాటిల్లనుంది.
 
తుంగభద్ర నుంచి కేసీకి కేటాయింపుల విషయంలోనూ తాగునీటి అవసరాల పేరుతో కొంత అనంతపురానికి తరలించడం వివాదాస్పదమవుతోంది. ఇటు తుంగభద్ర నీరో, అటు శ్రీశైలం నుంచి వచ్చేనీటినైనా మరికొన్ని రోజులు పూర్తి స్థాయిలో వచ్చి ఉంటే కేసీ పరిధిలోని వరి రైతులకు ధైర్యంగా ఉండేది. ఉన్న ఫలంగా నీటిని నిలిపి వేయడంతో వరి రైతులు ఆవేదనతో ఉన్నారు.
 
తుంగభద్ర నీరు ‘అనంత’కే
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీకి 32 టీఎంసీల నీటి కోటా ఉండగా, రిజర్వాయర్‌లో పూడిక పెరగడం, రిజర్వాయర్ కుదించకపోవడం లాంటి కారణాలతో 2014-15కు 26 టీఎంసీలు కేటాయించారు. ఈ నీటిలో మూడు, నాలుగు టీఎంసీల తుంగభద్ర నీరు వైఎస్సార్ జిల్లాకు వస్తోంది. మిగతాదంతా అనంతపురం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు... తాగు, సాగునీటి అవసరాలకు వాడుకుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే తుంగభద్ర నుంచి కేసీ కెనాల్‌కు కూడా పది టీఎంసీల నీటి కోటా ఉంది. తుంగభద్రలో పూడిక నెపంతో ఈసారి 6.8 టీఎంసీల నీటిని కేసీకి కేటాయించారు.

అందులోనూ అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకంటూ ఇందులో కొంతశాతాన్ని మళ్లింపుకు రంగంసిద్ధం చేశారు. ఇప్పటికే 1.50 టీఎంసీలకు సంబంధించి నీటిని విడుదల చేశారు. మరో రెండున్నర టీఎంసీ నీటిని అనంత నీటి అవసరాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా అక్కడి అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముందే కరువు కోరల్లో ఖరీఫ్‌ను కోల్పోయి విలవిల్లాడుతున్న రబీ రైతుకు కనీసం తుంగభద్ర నీరు కేసీకి వస్తుందని ఆశ పెట్టుకున్నా అడియాశలుగానే మిగిలిపోయాయి.
 
శ్రీశైలం నీటి కథ ముగిసింది
శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి కేసీకి పది టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికి ఏదో కొంత మేర ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటి మట్టానికి చేరితే ఇక ఎలాంటి కాలువలకు, ప్రాజెక్టులకు నీరిచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 849 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్లు తెలుస్తోంది. పోతిరెడ్డిపాడుకు 200 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నా కేసీకి నామమాత్రంగానే వదులుతున్నారు. అది కూడా కర్నూలు జిల్లాలోని ఎగువ ప్రాంత రైతులు వాడుకోగా కడప జిల్లా రైతుకు దక్కేది శూన్యమే.
 
బ్రహ్మంసాగర్‌కు ఎప్పటికి చేరేను?
కర్నూలు జిల్లా రుద్రవరం సమీపంలోని వెలుగోడు ప్రాజెక్టు నుంచి ఈనెల 19న తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్బాగమైన బ్రహ్మంసాగర్‌కు నీటిని విడుదల చేశారు.  వెయ్యి క్యూసెక్కులే విడుదల చేయడంతో అవి ఎప్పుడు బ్రహ్మంసాగర్‌కు వస్తాయో అంతు చిక్కడం లేదు. మైదుకూరు మండల పరిధిలోని లెక్కలవారిపల్లె వద్ద ఎస్‌ఆర్-2, ఎస్‌ఆర్-1 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక టీఎంసీ బ్రహ్మంసాగర్‌కు అధికారులు కేటాయించారు.

ఈ మధ్యనే ఎస్‌ఆర్-1 ప్రాజెక్టు ద్వారా  రోజుకు రెండు వేల క్యూసెక్కులనీరు విడుదల చేస్తే బ్రహ్మంసాగర్‌కు వెళ్లేసరికి వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే వెళ్లింది. మధ్యలో కాలువలు దెబ్బతిని ఉండడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. అయతే వెలుగోడు వద్ద కేవలం వెయ్యి క్యూసెక్కులు వస్తే ఎలా వస్తాయి. పైగా తాగనీటి అవసరాల పేరుతో ఎగువ రైతులు యధేచ్ఛగా వాడేసుకుంటున్నారు. ఈ స్థితిలో బ్రహ్మంసాగర్‌కు ఎంత నీరు ఎప్పటికి వస్తుందనేది అధికారులే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement